స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతికలోపం.. కరాచీలో ల్యాండింగ్‌

స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతికలోపం.. కరాచీలో ల్యాండింగ్‌

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన మరో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి దుబాయ్‌ వెళ్తున్న స్పైస్‌జెట్‌ ఎస్‌జీ - 11 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫ్యుయల్‌(ఇంధనం) ఇండికేటర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని పాకిస్థాన్‌లోని కరాచీకి దారి మళ్లించారు. కరాచీ ఎయిర్‌పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. గత 17 రోజుల్లో స్పైస్‌జెట్‌ విమానాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది ఆరోసారి.

తాజా ఘటనపై స్పైస్‌జెట్ సంస్థ ప్రతినిధి స్పందించారు. ఇండికేటర్‌ సమస్య కారణంగా విమానం ఆగిపోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రయాణికులను దుబాయి తీసుకెళ్లేందుకు కరాచీ ఎయిర్‌పోర్టుకు మరో విమానాన్ని పంపిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.

ఇటీవల స్పైస్‌జెట్ విమానాల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ బయల్దేరిన స్పైస్‌జెట్‌ విమానం క్యాబిన్‌లో పొగలు కమ్ముకున్నాయి. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే తిరిగి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. గత నెల జూన్ 19వ తేదీన ఢిల్లీకి బయల్దేరిన ఓ విమానం ఇంజిన్‌లోనూ మంటలు రావడంతో దాన్ని అత్యవసరంగా పట్నాలో దించేశారు. వరుస ఘటనలతో స్పైస్‌జెట్‌ ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.