కాశ్మీర్​లో బ్రిడ్జి  పైనుంచి పడ్డ బస్సు.. 10 మంది మృతి

కాశ్మీర్​లో బ్రిడ్జి  పైనుంచి పడ్డ బస్సు.. 10 మంది మృతి

కాశ్మీర్​లో బ్రిడ్జి  పైనుంచి పడ్డ బస్సు..పది మంది మృతి

మరో 57 మందికి గాయాలు

వైష్ణోదేవి యాత్రలో విషాదం

మృతుల్లో ఎక్కువమంది బీహార్​ వాసులే

జమ్మూ : జమ్మూకాశ్మీర్​లో ఘోర ప్రమాదం జరిగింది.. వైష్ణో దేవి యాత్రికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి కింద పడింది. దీంతో ఎనిమిది మంది భక్తులు అక్కడికక్కడే చనిపోగా ఆసుపత్రికి తీసుకెళుతుండగా మరో ఇద్దరు చనిపోయారు. మరో 57 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై ప్రెసిడెంట్​ ద్రౌపది ముర్ము, జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున నితీశ్​ కుమార్ పరిహారం ప్రకటించారు.

వెంటనే స్పందించిన స్థానికులు

బ్రిడ్జి పైనుంచి బస్సు కింద పడడం గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను బయటకు తీశారు. సీఆర్​పీఎఫ్​ సిబ్బంది అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మృతదేహాలను బయటకు తీయడంతో పాటు గాయాలపాలైన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు.

బీహార్ వాసులు..

బస్సు ప్రమాదంలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది బీహార్ వాసులేనని అధికారులు తెలిపారు. బీహార్​ లోని లఖీసరాయ్ టౌన్ కు చెందిన ఓ కుటుంబం వైష్ణో దేవీ యాత్ర వెళుతూ ఈ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. త్రికూట పర్వతాల్లోని వైష్ణో దేవీ ఆలయాన్ని దర్శించుకోవడానికి కాత్రా బేస్ క్యాంప్ గా ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచే అసలు యాత్ర మొదలవుతుందని భక్తులు చెబుతున్నారు. ఈ క్యాంప్ చేరుకునేందుకు బీహార్ యాత్రికులు బస్సును ఆశ్రయించారు. మార్గమధ్యంలో ప్రమాదం జరగడంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాగా, బస్సు ప్రమాదానికి కారణం కనుగొనేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు జమ్మూ పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిందిలా..

అమృత్​ సర్​ నుంచి కాత్రా వెళుతున్న బస్సు ఝజ్జర్ కోట్లి బ్రిడ్జి వద్ద అదుపు తప్పింది. రోడ్డుకు ఎడమవైపు వేగంగా వెళుతున్న బస్సు బ్రిడ్జిపై స్కిడ్​ అయి జారుతూ కుడి వైపు దూసుకెళ్లింది. బ్రిడ్జి రెయిలింగ్​ ను ఢీ కొట్టి కింద పడింది. మంగళవారం ఉదయం ఆరున్నర, ఏడు గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. రెయిలింగ్​ ను ఢీ కొట్టడంతో బస్సు ముందు చక్రాలు ఇరుక్కుపోగా.. బస్సు మాత్రం పల్టీ కొడుతూ కిందపడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు పది మంది చనిపోయారు. గాయపడ్డ 57 మందిని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.