నదిలో పడిన మినీ బస్సు 14 మంది మృతి..12 మందికి గాయాలు

నదిలో పడిన మినీ బస్సు 14 మంది మృతి..12 మందికి గాయాలు
  •     ఉత్తరాఖండ్​ రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనందా నది వద్ద ప్రమాదం 
  •     రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనంద నది వద్ద ప్రమాదం 
  •     మృతులకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం సంతాపం 

రుద్రప్రయాగ్ :  ఉత్తరాఖండ్​లో ఘోర ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఓ మినీ బస్సు అదుపు తప్పి అలకనందా నదిలోకి పడిపోవడంతో 12 మంది యాత్రికులు దుర్మరణం చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. రుద్రప్రయాగ్ జిల్లా రైతోలి సమీపంలో రిషికేశ్–బద్రీనాథ్ హైవేపై శనివారం ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై నుంచి దాదాపు 250 మీటర్ల లోతులోకి పడిపోవడంతో మినీ బస్సు నుజ్జునుజ్జు అయిపోయింది. యాక్సిడెంట్ సమయంలో ఆ టెంపో ట్రావెలర్(మినీ బస్సు)లో 26 మంది యాత్రికులు ఉన్నారని.. చోప్టా సందర్శనకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. 

వీరిలో అత్యధిక మంది ఢిల్లీకి చెందినవారే ఉన్నారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసు బృందాలు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయని అధికారులు తెలిపారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న పలువురు కూడా ఈ ఘటనలో గాయపడ్డారని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని రిషికేశ్ ఎయిమ్స్​కు, మిగతా క్షతగాత్రులను రుద్రప్రయాగ్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు. యాక్సిడెంట్ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, ఘటనపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్​ను ఆదేశించారు. ‘‘రోడ్డు ప్రమాదంలో మరణించినవారి ఆత్మలకు కేదారనాథుడు తన పాదాల చెంత చోటు ఇవ్వాలని, ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు మనోధైర్యం చేకూర్చాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా” అని సీఎం  పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ కూడా చేశారు.

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారికి సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాద ఘటన తన గుండెను ముక్కలు చేసిందని ప్రధాని మోదీ అన్నారు. స్థానిక అధికారులు బాధితులకు అండగా నిలవాలని చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా మృతులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.