నిర్మల్ జిల్లాలో లిక్కర్ వ్యాపారుల సిండికేట్

నిర్మల్ జిల్లాలో లిక్కర్ వ్యాపారుల సిండికేట్
  • గడువు చివరి రోజుల్లో మిలాఖత్ 
  • షాపులు పంచుకునే ప్లాన్ 
  • దరఖాస్తులకు ముగిసిన గడువు 
  • మొత్తం 981 దరఖాస్తులు

నిర్మల్, వెలుగు: నిర్మల్​ జిల్లాలో 47 వైన్స్​ షాపులకు మొత్తం 981 అప్లికేషన్లు వచ్చాయి. ఈనెల 18 వరకు మొత్తం 942 అప్లికేషన్లు రాగా .. గడువు పొడిగించిన తర్వాత మరో 39 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. జిల్లాలో పాత మద్యం వ్యాపారులు భారీగా వ్యాపారం జరిగే దుకాణాలను దక్కించుకునేందుకు సిండికేట్​గా మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట ఎక్సైజ్​ శాఖ అప్లికేషన్లకు ఈనెల 18 వరకు గడువు పెట్టింది.

 ఈనెల 17 వరకు 306 అప్లికేషన్లు రాగా.. ఒక్క 18నాడే 636 దరఖాస్తులు రావడం అనుమానాలకు తావిస్తుంది. గతంలో అనుభవమున్న వ్యాపారులు ఒక్కో దుకాణానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తాము కూడా పోటీకి దిగినట్టు చెప్తున్నారు. గతంలో ఆయా దుకాణాల గిరాకీని బట్టి ఆదాయం ఎక్కువగా ఉన్న షాపులకు ఒక్కోదానికి నాలుగైదు అప్లికేషన్లు చేసుకున్నట్టు భావిస్తున్నారు.

 షాపు ఎవరికి వచ్చినా అందరూ కలిసి నడిపించుకునేలా అగ్రిమెంట్​ చేసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నిర్మల్, బైంసా, ఖానాపూర్ పట్టణాల్లో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడినట్లు తెలుస్తోంది. అందువల్లే 18న ఒక్కరోజే భారీగా అప్లికేషన్లు వచ్చాయని అంటున్నారు. కొత్తగా అప్లికేషన్లు చేసేందుకు ముందుకొచ్చినవారితోనూ పాత వ్యాపారులు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. 

లిక్కర్​ బిజినెస్​లో అనుభవం లేకపోతే కష్టమని .. డ్రాలో షాపు దక్కితే పార్టనర్ షిప్​ ఇవ్వాలని.. లేదంటే గుడ్​ విల్​ తీసుకుని షాపులు అప్పగించాలని ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రిజర్వ్​ దుకాణాలు పొందిన వారిని కూడా ఒప్పించి వాటిని కూడా దక్కించుకునేందుకు లిక్కర్ బిజినెస్​లో అనుభవం ఉన్న వ్యాపారులు స్కెచ్​ వేస్తున్నట్టు చెప్తున్నారు. 

అప్లికేషన్ చేసుకున్న వారితో ఇప్పటి నుంచే టచ్ లో​ ఉంటున్నారు.   ఈసారి మద్యం దుకాణాలకు భారీగా డిమాండ్ ఉంది. మొత్తం 47 దుకాణాలకు గాను 981 దరఖాస్తులు రావడాన్ని బట్టి పోటీ తీవ్రంగానే ఉందని అర్థమవుతోంది. నిర్మల్, బైంసా, ఖానాపూర్ తో పాటు సరిహద్దుల్లోని షాపులకు ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వేసినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయితే గిరాకీ బాగా ఉంటుందని.. పట్టణాల్లో అయితే మున్సిపల్​ ఎన్నికలు గిరాకీ ఉంటుందని భావిస్తున్నారు.

మంచిర్యాల జిల్లాలో ఈ నెల 18 వరకు 1617 అప్లికేషన్లు రాగా.. చివరి రోజు88 అప్లికేషన్లతో మొత్తం 1712 వచ్చాయి. దీంతో మంచిర్యాలలో ఉన్న 73 వైన్స్ షాపులకు మొత్తం 1712 అప్లికేషన్లు వచ్చినట్లయింది. కాగా ఆదిలాబాద్ జిల్లాలో చివరి రోజు నాటికి 772 అప్లికేషన్లు వచ్చాయి. 18 వతేదీ నాటికి  711 ఉండగా.. 23 వరకు మరో 61 పెరిగి మొత్తం 772 అప్లికేషన్లు అయ్యాయి.