కలెక్టర్ పేరుతో తెలంగాణలో ఊరు! ఎందుకు పెట్టారో తెలుసా?

కలెక్టర్ పేరుతో తెలంగాణలో ఊరు! ఎందుకు పెట్టారో తెలుసా?
కలెక్టర్‌‌ పేరును ఒక ఊరుకు పెట్టడం ఈ ఏడాది చాలామందిని ఆకర్షించింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఒక ఊరుకు స్థానికులు ‘దివ్యాగూడ’ అనే పేరు పెట్టారు. ఈ పేరుకు కారణం దివ్యా దేవరాజన్‌ అనే ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌‌. దాదాపు మూడేళ్లపాటు ఆమె ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌‌గా పనిచేసి, ఈ ఏడాది ప్రారంభంలో బదిలీపై వెళ్లారు. ఆమె వెళ్లిపోయినా ఆమె సేవల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అంతగా ప్రజలకు నచ్చడానికి ఆ ఐఏఎస్‌ ఏం చేశారు? ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే, వాళ్ల సమస్యల్ని అంత బాగా అర్థం చేసుకుని పరిష్కరించొచ్చు. దివ్యా దేవరాజన్‌‌ 2017లో ఆదిలాబాద్‌‌ కలెక్టర్‌‌‌‌గా వచ్చారు. దివ్యా దేవరాజన్‌‌ కలెక్టర్‌‌‌‌గా ఛార్జ్‌‌ తీసుకున్న మూడు నెలల్లోనే గోండు భాష నేర్చుకున్నారు. అలా ప్రజలతో కలిసిపోవడం, వాళ్ల సమస్యల్ని అర్థం చేసుకోవడం ఈజీ అయింది. ఆమె కలెక్టర్‌‌‌‌గా అడుగుపెట్టేటప్పటికి, గిరిజన తెగల మధ్య ఉన్న గొడవల కారణంగా శాంతిభద్రతల సమస్య ఉండేది. దివ్య చాలా పరిణితితో ఆలోచించి, ఆ సమస్యను పరిష్కరించారు. ఆ తర్వాత స్థానిక సమస్యలపై దృష్టిపెట్టారు. కలెక్టరేట్‌‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అధికారులు అందుబాటులో ఉంటూ, సమస్యల్ని పరిష్కరించేలా చేశారు. భాష కారణంగా తమ సమస్యల్ని డాక్టర్స్‌‌కు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ల బాధను అర్థం చేసుకున్న దివ్య, గవర్నమెంట్‌‌ హాస్పిటల్స్‌‌లో ‘ట్రైబల్‌‌ కో–ఆర్డినేటర్స్‌‌’ను నియమించారు. గిరిజన గూడేలను రెగ్యులర్‌‌‌‌గా విజిట్‌‌ చేస్తూ, ప్రజలతో కలిసి పోయేవారు. అక్కడివాళ్ల పేర్లు కూడా ఆమెకు తెలుసంటే, వాళ్లతో ఎంతగా మమేకమయ్యారో అర్థం చేసుకోవచ్చు. చాలా ఏళ్లుగా పెండింగ్‌‌లో ఉన్న భూముల గొడవల్ని తీర్చారు. గిరిజన ఉత్పత్తుల సేకరణ, అమ్మకం వంటి వాటిలోఉన్న ఇబ్బందుల్ని తొలగించారు. వరద ముంపు గ్రామాలకు ఆ సమస్య రాకుండా, పరిష్కారం చూపారు. అందుకే ఆమెను స్థానికులు తమ కుటుంబ సభ్యురాలే అనుకుంటారు. గిరిజన జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేసిన దివ్యా దేవరాజన్‌‌ సేవలకు గుర్తుగా గూడేనికి ఆమె పేరు పెట్టుకున్నారు. For More News.. ఈ ఏడాది ఎక్కువగా ఇవే వెతికిన్రు ఈ ఏడాది బ్యాలెన్స్ తప్పింది! నీతి ఆయోగ్ న్యూఇయర్ ప్లాన్స్ రోహిత్ ఆడాలంటే మరోకరిపై వేటు పడాల్సిందే..