పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచం.. పెంచబోం.. పెంచేది లేదు

పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచం.. పెంచబోం.. పెంచేది లేదు

దేశ వ్యాప్తంగా ఇంధన కొరతపై గందరగోళం.. అనుమానాలపై క్లారిటీ ఇస్తూనే.. కేంద్రం మరో సంచలన ప్రకటన చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నట్లు వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవం అని స్పష్టం చేసింది కేంద్రం. ఇంధన సరఫరాలకు సంబంధించిన అంశాలపై కేంద్ర పెట్రోలియం నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. 

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చారామె. అంతే కాదు.. పెట్రోల్ , డీజిల్ రేట్లు పెంచం.. పెంచబోం.. పెంచేది లేదు అంటూ ఖరాఖండిగా తేల్చిచెప్పారామె.

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మారుతున్నా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. మార్చి 25న కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న పెట్రో ధరల పెంపు వార్తల్లో నిజం లేదని, అటువంటి పుకార్లను నమ్మవద్దని ఆమె కోరారు. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని భరోసా ఇచ్చారు.

పెట్రోల్ ధరలతో పాటు కమర్షియల్ గ్యాస్, గ్యాస్ కనెక్షన్ల విషయంలోనూ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలకు 22వేల టన్నుల కమర్షియల్ ఎల్‌పీజీని కేటాయించినట్లు సుజాత శర్మ వెల్లడించారు. ఇది వ్యాపార వర్గాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. కేవలం ఇంధన సరఫరానే కాకుండా, పర్యావరణ హితమైన పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లను పెంచడంలోనూ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని ఆమె చెప్పారు. గత 25 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 2.5 లక్షల కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను మంజూరు చేసినట్లు ఆమె వెల్లడించారు.

మొత్తం మీద అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ.. భారత ప్రభుత్వం ముందస్తు చర్యల ద్వారా దేశీయ మార్కెట్లో ధరలను అదుపులో ఉంచుతూనే.. గ్యాస్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.