ఆస్తి కోసం భర్త అంత్యక్రియలు అడ్డుకున్న భార్య

ఆస్తి కోసం భర్త అంత్యక్రియలు అడ్డుకున్న భార్య

మంథని, వెలుగు: ఆస్తి కోసం భర్త అంత్యక్రియలను అడ్డుకుంది ఓ మహిళ. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్‌‌‌‌ (36)కు నాలుగేళ్ల కింద సంధ్యతో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. సునీల్‌‌‌‌, సంధ్య మధ్య గొడవలు జరగడంతో ఏడాది నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా సునీల్‌‌‌‌ మూడు రోజుల క్రితం హైదరాబాద్‌‌‌‌లో చనిపోయాడు.

 దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం మంథనిలోని గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న సంధ్య కుటుంబ సభ్యులతో కలిసి మంథనికి చేరుకొని అంత్యక్రియలు అడ్డుకుంది. సునీల్‌‌‌‌ ఆస్తిలో తన కుమారుడికి వాటా ఇవ్వాలని పట్టుబట్టింది. విషయం తెలుసుకున్న మంథని ఎస్సై రమేశ్‌‌‌‌ సోమవారం వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది. అనంతరం సునీల్‌‌‌‌ అంత్యక్రియలు పూర్తి చేశారు.