
నిర్మల్, వెలుగు: నిర్మల్ కు చెందిన ఓ మహిళ ఆన్లైన్లో ఓ వస్తువు కొని అది నచ్చక రిటర్న్పంపే క్రమంలో రూ.2 లక్షలు పోగొట్టుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం..కొద్దిరోజుల కింద ఓ మహిళ ఆన్లైన్ కామర్స్ వెబ్సైట్లో ఓ వస్తువు కొనుగోలు చేసింది. నచ్చక పోవడంతో దానిని రిటర్న్ చేసేందుకు రిక్వెస్ట్ పెట్టుకుంది. తర్వాత ఆమెకు షాపింగ్ ఏజెంట్ పేరిట ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్‌చేసిన వ్యక్తి ‘మీ వస్తువు రిటర్న్చేయాలంటే కొన్ని డిటెయిల్స్ కావాలి. మీకో లింక్ పంపిస్తాను. అందులో మీ వివరాలన్నీ ఇవ్వండి’ అని లింక్పంపించాడు. ఆ లింక్ ఓపెన్ చేసి వస్తువుకు సంబంధించిన వివరాలు పంపించారు. వెంటనే ఆమె అకౌంట్లోని రూ.2 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. షాక్‌కు గురైన ఆమె వెంటనే పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ చేశారు. దీన్ని మోసంగా గుర్తించిన సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.