
హైదరాబాద్ సిటీలో రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తంలో జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్త పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఇవాళ తాజాగా మల్కాజిగిరిలోని వసంతపురి కాలనీకి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆమె అనుమానంతో సోమవారం ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమె శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయగా.. కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమెను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, ఆ మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మల్కాజిగిరిలోని వసంతపురి కాలనీలో ఆమె నివసించే అపార్టుమెంటు ఏరియాను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. వైరస్ వ్యాప్తి జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.