సింగరేణిలో మరో ప్రమాదం.. విరిగిన కార్మికుడి కాలు 

సింగరేణిలో మరో ప్రమాదం.. విరిగిన కార్మికుడి కాలు 

మంచిర్యాల: సింగరేణిలో మరో ప్రమాదం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్సీ 3లో పైకప్పు కూలి నలుగురు కార్మికులు చనిపోయిన ఘటనకు ఒక రోజు గడవకముందే.. మరో ప్రమాదం చోటు చేసుకుంది. అదే ప్రాంతంలోని ఆర్కే 7 గనిలో  బొగ్గు  ఉత్పత్తి పని స్థలంలో జారి పడి సంతోష్ (30) అనే కార్మికుడికి కాలు విరిగింది. దీంతో అతడ్ని వెంటనే సింగరేణి ఆస్పత్రికి తరలించారు. అయితే  ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

భయంతో విధులకు 20 శాతం కార్మికులే హాజరు

కాగా, సింగరేణిలో ఘోరం జరిగింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ఏరియాలోని ఎస్సార్పీ 3 బొగ్గు గనిలో పై కప్పు కూలి నలుగురు కార్మికులు చనిపోయారు. గనిలో సీమ్ జంక్షన్​ నుంచి 15 మీటర్ల దూరంలోని వర్క్ ప్లేస్ దగ్గర భారీ పై కప్పు (బొగ్గు బండ) బుధవారం ఒక్కసారిగా కూలింది. దాంతో టింబర్ ​మెన్ ​బేర లచ్చయ్య(61), వి.కృష్ణారెడ్డి(58), బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహరాజు(32), రెంక చంద్రశేఖర్​(32)  అక్కడికక్కడే మరణించారు. పై కప్పు వారం రోజుల నుంచే ప్రమాదకరంగా మారిందని చెబుతున్నారు. దాన్ని సరి చేసేందుకు ఉదయం షిఫ్టులో నలుగురు కార్మికులు లోపలికి వెళ్లారు. పై కప్పు కూలకుండా రోప్, దాట్లు, ఐరన్​ మెష్​ బిగించే పనులు చేపట్టారు. వారు డ్యూటీకెక్కిన మూడు గంటల్లోనే ప్రమాదం జరిగింది. బొగ్గు బండ కింద కూరుకుపోయిన చంద్రశేఖర్ ​మృతదేహాన్ని సింగరేణి రెస్క్యూ బృందం సాయంత్రం ఐదింటి ప్రాంతంలో గని బయటకు తీసుకొచ్చింది. శవాన్ని పోలీసులు నేరుగా ఆస్పత్రికి తరలించబోగా కార్మికులు, కార్మిక సంఘాలు అడ్డుకోవడం తీవ్ర తోపులాటకు దారితీసింది. చివరకు తరలింపు ప్రయత్నాన్ని పోలీసులు విరమించుకున్నారు. ఒక్కో కార్మికుని కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. ఇకపోతే, నిన్నటి ప్రమాదం నుంచి కార్మికులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతోందనన్న భయంతో ఎస్సార్పీ 3 గనిలో మొదటి షిఫ్టుకు కేవలం 20 శాతం మంది కార్మికులు మాత్రమే విధులకు హాజరయ్యారు. 

మరిన్ని వార్తల కోసం: 

ఆకలి తీర్చే దేవత.. వందేళ్ల తర్వాత తిరిగొచ్చింది

దళితబంధు అమలు చేసుకోవచ్చు

నేరం ఒప్పుకోలేదని యువకుడ్ని చితకబాదిన పోలీసులు