
20 నిమిషాల్లో ఫుల్‌బాటిల్ ఖాళీ
ధర్పల్లి, వెలుగు: స్నేహితులతో పందెం కట్టి ఫుల్‌బాటిల్ మందు 20 నిమిషాల్లో తాగి ఓ యువకుడు ప్రాణాలను పోగొట్టుకున్నాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ధర్పల్లి గ్రామం గోసంగి కాలనీకి చెందిన కడమంచి కాశయ్య(35), అదే కాలనీకి చెందిన దుర్గయ్య, సాయిలు ఫ్రెండ్స్. ముగ్గురూ వేర్వేరు గ్రామాల్లో సున్నం వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. పనులకు వెళ్లొచ్చిన ముగ్గురు స్నేహితులు గురువారం సాయంత్రం వైన్స్‌కు వెళ్లారు. సాయిలు, దుర్గయ్య బీర్లు తాగారు. కాశయ్య విస్కీ హాఫ్ బాటిల్ తాగాడు. అక్కడినుంచి బయలుదేరే సమయంలో కాశయ్య మద్యం ఎక్కువై అటుఇటు పడిపోతుంటే సాయిలు, దుర్గయ్య హాఫ్‌కే ఊగిపోతే ఎలా అంటూ గేలి చేశారు. దీంతో కాశయ్య ఇద్దరితో ఫుల్‌బాటిల్ మళ్లీ కచ్చా తాగుతానని వెయ్యి రూపాయల పందెం కాశాడు. అన్న ప్రకారం 20 నిమిషాల్లో విస్కీ ఫుల్‌బాటిల్ తాగాడు. వెంటనే నిద్రొస్తుందని సాయిలుపై ఒరిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆటోను తెప్పించి కాశయ్యను ఇంట్లో దించి సాయిలు, దుర్గయ్య వెళ్లిపోయారు. రాత్రి అపస్మారక స్థితిలోనే కాశయ్య కడుపు ఉబ్బిపోవడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్తరలిస్తుండగా మృతిచెందాడు. కాశయ్యకు భార్య, ఓ కూతురు, నలుగురు కొడుకులు ఉన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.