కారులో వచ్చి మంజీర నదిలో దూకిన యువకుడు

కారులో వచ్చి మంజీర నదిలో దూకిన యువకుడు

పుల్కల్, వెలుగు: మంజీర నదిలో దూకి ఓ యువకుడు గల్లంతైన సంఘటన చౌటకూర్ మండలం శివంపేట సమీపంలోని మంజీర నది వంతెన వద్ద మంగళవారం జరిగింది. అందోల్ మండలం జోగిపేట పట్టణంలోని ఇందిరనగర్ కాలనీకి చెందిన అల్లె లోకచంద్ర (31) క్లింకార యూట్యూబర్ శివంపేట బ్రిడ్జి వద్దకు కారులో చేరుకుని కిందకుదిగి నదిలో దూకుతున్న దృశ్యం ఎహెచ్ఏఐ సీసీ కెమెరాలో రికార్డు అయింది.  

సింగూరు ప్రాజెక్టుకు ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి భారీ వరద వస్తుండటంతో 11 క్రస్ట్ గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం అధికంగా ఉంది. ఈ సంఘటన విషయాన్ని స్థానికులు పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ కు సమాచారం అందించగా, ఆయన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందాన్ని రప్పించారు. ఏయిర్ బోట్ల సహాయంతో గల్లంతైన వ్యక్తి కోసం మంజీర నది పరివాహక ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే దాక గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను నిలిపివేశారు. మృతుడికి భార్య ప్రియ, రెండేళ్ల పాప ఉన్నారు. ఎస్ఐ విశ్వజన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.