
- లైంగిక దాడి కేసులో యువకుడు అరెస్ట్
- జ్వరంతో వచ్చిన యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు
కరీంనగర్ క్రైం, వెలుగు : హాస్పిటల్‌లో యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడిని కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ గౌస్ ఆలం మంగళవారం వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఓ యువతి జ్వరంతో బాధపడుతూ ఈ నెల 6న కరీంనగర్‌లోని శ్రీ దీపిక హాస్పిటల్‌లో చేరింది. ఇదే హాస్పిటల్‌లో మహారాష్ట్రలోని సిరోంచ వద్ద గల లక్ష్మీదేవిపేటకు చెందిన పెద్ది దక్షణ్ అలియాస్ దక్షిణామూర్తి కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు.
ఇతడు యువతికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయంపై యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు దక్షిణామూర్తిని అరెస్ట్ చేశారు. నాలుగేండ్ల కింద కరీంనగర్‌కు వచ్చిన దక్షిణామూర్తి రెండు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పనిచేశాడని, మద్యం సేవించి డ్యూటీకి వస్తుండడంతో అతడిని ఉద్యోగం నుంచి తీసేశారని సీపీ తెలిపారు.
కొంతకాలం స్వగ్రామంలో ఉన్న అతడు ఇటీవల మళ్లీ కరీంనగర్‌కు వచ్చి ఆదర్శనగర్‌లో నివాసం ఉంటూ దీపిక హాస్పిటల్‌లో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడని వివరించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకటస్వామి, త్రీటౌన్ సీఐ జాన్‌రెడ్డి పాల్గొన్నారు.