లవర్​తో కిడ్నాప్​ చేయించుకున్న యువతి

లవర్​తో కిడ్నాప్​ చేయించుకున్న యువతి
  • అతడిని పెండ్లాడి సోషల్​మీడియాలో వీడియో
  • రాజన్న సిరిసిల్ల జిల్లా మూడపల్లిలో ఘటన

చందుర్తి , వెలుగు : ప్రేమించిన వ్యక్తిని పెండ్లాడేందుకు ఓ యువతి ప్రియుడితో కలిసి ఆడిన కిడ్నాప్ డ్రామా పోలీసులతో పాటు అందరినీ టెన్షన్​కు గురిచేసింది. మంగళవారం తెల్లవారుజామున తండ్రితో కలిసి గుడికి వెళ్లిన యువతిని ఆమె ప్రేమికుడు కిడ్నాప్​ చేయడం, అడ్డువచ్చిన తండ్రిని కొట్టి నెట్టేయడం సీసీటీవీ కెమెరాల్లో  రికార్డయ్యాయి. చివరికి ఆ యువతి తనను కిడ్నాప్​ చేసిన యువకుడినే పెండ్లాడింది. పెండ్లయ్యాక ఆ వీడియోలను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన  గోలి షాలిని (18), అదే గ్రామానికి చెందిన కట్కూరి జ్ఞానేందర్ (24) గత నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు వారి పెండ్లికి  ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఇద్దరూ ఏడాది క్రితం ఇంట్లోంచి పారిపోయి పెండ్లి చేసుకున్నారు. అప్పుడు షాలిని మైనర్ కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు జ్ఞానేందర్ పై పోక్సో చట్టం కింద కేసు పెట్టగా.. కొద్ది రోజులు అతను జైల్లో ఉన్నాడు. ఈలోపు షాలిని తల్లిదండ్రులు ఆమెకు పెండ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. సోమవారం ఓ యువకుడితో పెండ్లి కూడా నిశ్చయించారు. ఈ విషయాన్ని షాలిని జ్ఞానేందర్ కు చెప్పి, తనను ఎలాగైనా తీసుకెళ్లి పెండ్లి చేసుకోవాలని కోరింది. తెల్లవారుజామునే తాను తండ్రితో కలిసి హనుమాన్​టెంపుల్ లో పూజలకు వస్తానని, అక్కడికి రావాలని చెప్పింది. మంగళవారం ఉదయం 5 గంటలకు మాస్క్ ధరించి టెంపుల్ దగ్గర నలుగురు యువకులతో కలిసి మాటు వేసిన జ్ఞానేందర్..​ ఆమె గుడిలోంచి బయటకు రాగానే కిడ్నాప్​ చేసి కారులో ఎక్కించి తీసుకెళ్లాడు. యువతి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు స్టార్ట్ చేశారు. మూడు టీంలుగా ఏర్పడి గాలింపు మొదలుపెట్టారు.

పెద్దలు పెండ్లికి ఒప్పుకోనందు వల్లే.. 

పోలీసులు గాలిస్తుండగానే షాలిని.. జ్ఞానేందర్​ ను పెండ్లి చేసుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది. పెండ్లి చీరలో నవ్వుతూ మాట్లాడింది. తమ కులాలు వేరు కావడంతో  తమ పెండ్లికి పెద్దలు ఒప్పుకోలేదని, అందుకే ఇలా డ్రామా ఆడాల్సి వచ్చిందని తెలిపింది. తానే జ్ఞానేందర్ ను రమ్మన్నానని, అతను మాస్క్ పెట్టుకొని రావడంతో ప్రతిఘటించానని పేర్కొంది. తాను ఇష్టపూర్వకంగానే జ్ఞానేందర్​ను వివాహం చేసుకున్నానని చెప్పింది.

పెళ్లి చేసుకొని ఎస్పీని కలిసిన జంట

కొండగట్టులో పెళ్లి చేసుకున్న అనంతరం షాలిని, జ్ఞానేందర్​(జానీ) జంట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ని కలిశారు. ఈ సందర్భంగా తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని,ఇష్ట పూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని షాలిని స్టేట్ మెంట్ ఇచ్చింది. తమకు ప్రాణ భయం ఉందని చెప్పడంతో రక్షణ కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.  తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసుల సమయం వృథా చేయవద్దని ఎస్పీ వాళ్లకు హితవు పలికారు. అనంతరం ఇరువురి కుటుంబ సభ్యులకు వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో  కౌన్సెలింగ్ ఇప్పించారు.