Aakasamlo Oka Tara: 'రాధే రాధే' అంటూ వచ్చేసిన దుల్కర్.. 'ఆకాశంలో ఒక తార' ఎమోషనల్ మెలోడీ ఎలా ఉందంటే?

Aakasamlo Oka Tara: 'రాధే రాధే' అంటూ వచ్చేసిన దుల్కర్..  'ఆకాశంలో ఒక తార' ఎమోషనల్ మెలోడీ ఎలా ఉందంటే?

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. విభిన్నమైన కథలు, సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ హీరో.. ఇప్పుడు 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara) సినిమాతో మరోసారి ఎమోషనల్ జర్నీకి సిద్ధమవుతున్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి  'రాధే రాధే'  సాంగ్ రిలీజ్ చేశారు. 

ఇప్పటికే గ్లింప్స్, టీజర్, పాటలు, పోస్టర్లతో సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్ర బృందం.. ఇప్పుడు 'రాధే రాధే' పూర్తి పాటతో మరింత పెంచేశారు. ఈ పాట ప్రోమోలో దుల్కర్ సల్మాన్, బిజిలీ పాత్రలో నటిస్తున్న రుహాని శర్మ మధ్య సంభాషణ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. గుజరాత్‌కు వెళ్లడానికి రెండు ప్రధాన కారణాలుంటాయని, ఒకటి ద్వారకను దర్శించుకోవడం, మరొకటి బొగ్గు గనుల్లో పనిచేసి జీవనం సాగించడం అని వారి మాటలు సూచించాయి. పూర్తి పాటలో దుల్కర్ పాత్ర ఉపాధి కోసం గుజరాత్‌లోని బొగ్గు గనులకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పాత్ర ఎదుర్కొనే కష్టాలు, జీవిత పోరాటంపై ఆసక్తి పెరిగింది.

ఈ పాటకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించడమే కాకుండా, లిప్సిక భాష్యంతో కలిసి ఆలపించారు. శ్రీమణి అందించిన సాహిత్యం కథానాయకుడి అంతరంగంలోని బాధను, కష్టపడే తత్వాన్ని, ముందుకు సాగాలనే పట్టుదలను ప్రతిబింబిస్తోంది. మెలోడీతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చిన ఈ పాట సినిమాలో కీలకమైన సందర్భంలో వినిపించవచ్చనే ఆసక్తి నెలకొంది.

ఇక దుల్కర్ సల్మాన్ తన హావభావాలతో పాత్రలోని అంతర్గత సంఘర్షణను చక్కగా ఆవిష్కరించినట్లు పాటలో కనిపిస్తోంది. బిజిలీగా రుహాని శర్మ ఆయన ప్రయాణంలో తోడుగా నిలుస్తూ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తుండగా, సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతున్నారు. సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయి. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శ్వేతా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

భారీ అంచనాల మధ్య ఈ 'ఆకాశంలో ఒక తార' నవంబర్ 20, 2026న పలు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ ఎమోషనల్ డ్రామాలో దుల్కర్ ఎలాంటి అనుభూతిని పంచుకోనున్నారో చూడాలి.