గోవా ఎన్నికల ప్రచారంలో లిక్కర్ పాలసీ సొమ్ము 45 కోట్లు

గోవా ఎన్నికల ప్రచారంలో లిక్కర్ పాలసీ సొమ్ము 45 కోట్లు
  • ఆప్ నేతలు వాడుకున్నరంటూ కోర్టుకు ఈడీ వివరణ

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ద్వారా చేతులు మారిన రూ.45 కోట్ల ముడుపులను 2022లో జరిగిన గోవా ఎన్నికల ప్రచారంలో ఆప్ నేతలు వాడినట్లు ఐటీ, సీబీఐ దర్యాప్తులో కూడా తేలిందని, ఈ విషయాన్ని ఆ సంస్థలు ధ్రువీకరించాయని ఈడీ అధికారులు వెల్లడించారు. కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలోఈ విషయాన్ని అధికారులు తెలిపారు. ఈ కేసులో హవాలా ఆపరేటర్ల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. లిక్కర్  స్కామ్  కేసులో వెలుగులోకి వచ్చిన మనీ లాండరింగ్  వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆయన పార్టీ నేతలను ప్రాసిక్యూట్ చేయనున్నామని పేర్కొన్నారు. 

ఆప్  నేతలకు సౌత్  గ్రూప్, లిక్కర్  బిజినెస్ మెన్  ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపుల్లో రూ.45 కోట్లను ఆప్  నేతలు గోవా ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారని చెప్పారు. ‘‘ఔట్ డోర్  ప్రచారం కోసం నియమితులైన చారియెట్  ప్రొడక్షన్స్  వెండర్లలో ఒక వెండర్ ను ప్రశ్నించగా.. ముంబైలోని ఆపరేటర్ నుంచి రూ.6.29 లక్షలు అందాయని ఒప్పుకున్నాడు. దీంతో అంగదియా ఆపరేటర్ ఆర్. కాంతిలాల్  వాంగ్మూలాన్ని రికార్డు చేశాం. 2022 జనవరిలో గోవా ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని కాంతిలాల్  చెప్పాడు. తర్వాత ఐటీ అధికారులను మేము(ఈడీ) సంప్రదించి వివరాలు సేకరించాం. హవాలా ద్వారా తరలించిన రూ.45 కోట్లను స్వాధీనం చేసుకున్నాం” అని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు.