ఆప్, ఎంఐఎం.. బీజేపీ ట్రాప్​లో పడ్డయ్: భట్టి

ఆప్, ఎంఐఎం.. బీజేపీ ట్రాప్​లో పడ్డయ్: భట్టి

హైదరాబాద్, వెలుగు: ఆప్, ఎంఐఎం.. బీజేపీ ట్రాప్ లో పడ్డాయని, గుజరాత్ లో ఆ పార్టీ గెలిచేందుకు సహకరించాయని సీల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీపై నమ్మకంతో గుజరాతీలు ఓట్లు వేసినట్లుగా కనిపించడం లేదన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా హాల్​లో ఆయన మాట్లాడారు. ‘‘గుజరాత్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండే. కానీ బీజేపీ డబ్బుతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడి విజయం సాధించింది. ప్రచారంలో ప్రధాని మోడీ తన స్థాయి మర్చిపోయి గుజరాత్ ప్రతినిధిలా మాట్లాడారు. ఆప్, బీజేపీ మధ్యే పోటీ ఉన్నట్లుగా మీడియాలో ప్రచారం చేయించి లబ్ధి పొందారు. కాంగ్రెస్ గెలుస్తుందన్న భయంతోనే ప్రధాని 36 సభల్లో పాల్గొన్నారు” అని అన్నారు. గుజరాత్ లో పార్టీ ఓటమికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఒక్కరే బాధ్యుడు కాదని, పార్టీ మొత్తం బాధ్యత వహించాలన్నారు. గుజరాత్ స్ఫూర్తితో తెలంగాణలోనూ గెలుస్తామని బీజీపీ స్టేట్ చీఫ్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. ఆయన ఎప్పుడూ అధికారం కోసమే చూస్తారని అన్నారు.

షెడ్యూల్ ప్రకారమే రాహుల్ యాత్ర.. 

హిమాచల్ ప్రదేశ్ లో మంచి మెజార్టీతో కాంగ్రెస్ గెలవడం.. దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోందని భట్టి అన్నారు. మోడీ అరాచకాలను సహించలేని హిమచల్ ప్రదేశ్ ప్రజలు బీజేపీని ఓడించి కాంగ్రెస్ ను గెలిపించారని చెప్పారు. ‘‘రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎన్నికల కోసం కాదు. విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశాన్ని ఏకం చేసేందుకు చేస్తున్నారు. ముందుస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. కాంగ్రెస్ కమిటీల నియామకంపై కసరత్తు జరుగుతోంది. సీనియారిటీ, అనుభవం ఆధారంగానే కమిటీల్లో స్థానం కల్పించాలని కోరాను” అని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారని, క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చిందని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సమైక్య రాష్ట్ర వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోరుకున్నందుకే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు.