కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన.. పోలీసుల అదుపులో అతీషి, సౌరభ్

 కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన.. పోలీసుల అదుపులో అతీషి, సౌరభ్

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్  స్కామ్  కేసులో అరెస్టయిన సీఎం అర్వింద్  కేజ్రీవాల్ కు మద్దతుగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆప్  కేబినెట్  మంత్రులు అతిషి, సౌరభ్  భరద్వాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్  అరెస్టును నిరసిస్తూ ఆప్  నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఉదయం సెంట్రల్  ఢిల్లీలోని రౌస్  అవెన్యూ రోడ్డుపై నిరసన ప్రదర్శన చేపట్టారు. కేజ్రీవాల్ ఫొటోలు పట్టుకొని డీడీయూ మార్గ్​లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆప్  మంత్రులు అతీషి, సౌరభ్  భరద్వాజ్​ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మంత్రులతో పాటు నేతలు, కార్యకర్తలను బస్సుల్లో ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మహిళా కార్యకర్తలు, నేతలను మహిళా పోలీసులు ఈడ్చుకెళ్లి బస్సుల్లోకి తోసేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రౌస్  అవెన్యూ రోడ్డులో ముందుగానే నిషేధాజ్ఞలు విధించారు. సీఎం నివాసంతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద కేంద్ర బలగాలను మోహరించారు.

 పారామిలిటరీ బలగాలను కూడా తరలించారు. పోలీసులు తమను అదుపులోకి తీసుకుంటుండగా ఆప్  నేతలు, కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులు బలవంతంగా వారిని ఈడ్చుకెళ్లి బస్సుల్లోకి ఎక్కించారు. దాదాపు 50 మందిని తరలించారు. ఈ సందర్భంగా ఆప్  మంత్రి అతీషి మాట్లాడుతూ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఉందన్నారు. తమ సీఎంను అరెస్టు చేసి బీజేపీ అతిపెద్ద రాజకీయ తప్పిదానికి పాల్పడిందని ఆమె మండిపడ్డారు. ‘‘ప్రతిపక్ష నేతలను జైలుకు పంపడం లేదా బెదిరించి వారి పార్టీలో చేర్పించుకోవడం వంటివి చేయడం ద్వారా అపొజిషన్  పార్టీలను బీజేపీ అంతం చేస్తున్నది. ముందుగా మా సీఎంపై వారు(బీజేపీ నేతలు) తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. దీనిపై శాంతియుతంగా నిరసన చేస్తున్న మమ్మల్ని కూడా అరెస్టు చేశారు. ఇది ప్రజాస్వామ్య హత్య కాకపోతే మరేంటి?” అని అతీషి ట్వీట్  చేశారు. 

రంగ్ దే బసంతి పాట పాడుతున్న వీడియో పోస్టు

ఆప్  కేబినెట్  మంత్రి సౌరభ్  భరద్వాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అలీపూర్  పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ సౌరభ్  ఆప్  కార్యకర్తలతో కలిసి ‘మేరా రంగ్  దే బసంతి చోలా’ పాట పాడారు. ఆ పాటను ట్విటర్​లో పోస్టు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను పోలీసులు 
అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

‘కేజ్రీవాల్​తో ఇండియా’ హ్యాష్ ట్యాగ్​

సీఎం అర్వింద్  కేజ్రీవాల్​కు మద్దతుగా ఆప్  నేతలు ‘కేజ్రీవాల్​తో ఇండియా’ హ్యాష్ ట్యాగ్  పేరుతో సోషల్  మీడియాలో ప్రచారం ప్రారంభించారు. ఇండియా కూటమి కూడా కేజ్రీవాల్  అరెస్టును ఖండిస్తూ వారి ప్రచారానికి మద్దతు తెలిపింది. నియంతృత్వంతో వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆప్  నేతలు ట్వీట్  చేశారు. కాశ్మీర్  నుంచి కన్యాకుమారి దాకా కేజ్రీవాల్​కు మద్దుతుగా ప్రజలు గొంతెత్తుతున్నారని వారు పేర్కొన్నారు.

కేజ్రీ ఇంటికి ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు

ఆప్  ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు కేజ్రీవాల్ ఇంటికిచేరుకుని సీఎం కుటుంబానికి సంఘీభావం తెలిపారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కలవకుండా పోలీసులు అడ్డుకున్నారని, సీఎం ఫ్యామిలీని గృహ నిర్బంధంలో ఉంచారని పేర్కొన్నారు. నియంతృత్వం ఎల్లకాలం నడవదన్నారు. వెంటనే సీఎం ఫ్యామిలీని గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలని డిమాండ్  చేశారు. ఢిల్లీతో పాటు గుజరాత్, పంజాబ్,  కర్నాటకలోనూ కేజ్రీవాల్  అరెస్టును నిరసిస్తూ ఆప్  లీడర్లు, కార్యకర్తలు ప్రదర్శనలు చేశారు.