స్పెషల్​ : నీటి ఆదాకు జల్​సేవక్​

స్పెషల్​ : నీటి ఆదాకు జల్​సేవక్​

స్నానం చేసిన, గిన్నెలు కడిగిన, బట్టలు ఉతికిన నీళ్లు ఎక్కడికి వెళ్తాయి? అదేం ప్రశ్న? మురికి కాలువల్లోకి... అంటున్నారా. కానీ ఆ నీళ్లు మంచినీళ్లను కలుషితం చేస్తున్నాయి. అలాకాకుండా ఉండాలంటే వాడిన నీళ్లను రీసైకిల్ ​చేసి వాడాలి. అప్పుడు మంచినీటి వనరులు కలుషితం కాకుండా ఉంటాయి. అంతేకాదు చాలా నీటిని ఆదా చేసినట్టు అవుతుంది అంటున్నాడు పూణెకి చెందిన అభిజిత్​ సాథె. 45 ఏండ్ల ఈ ఐఐటియన్ అందుకుగాను జల్​సేవక్​ సొల్యూషన్స్​ పేరిట ఒక ఎక్విప్​మెంట్​ కనుగొన్నాడు.

‘‘ఇండియాలో గృహావసరాలకు వాడే  గ్రేవాటర్​ అంటే...  స్నానం చేసిన, బట్టలు ఉతికిన, వంటగదిలో, సింక్​లో వాడే నీళ్లను రీసైకిల్​ చేస్తే టాయిలెట్​ ఫ్లష్​ కోసం, మొక్కలకు ఆ నీటిని వాడొచ్చు. ఆ నీళ్లను రీసైకిల్​ చేసేందుకే జల్ సేవక్​ సొల్యూషన్స్​ మొదలుపెట్టా. ఇప్పటివరకు ఈ సిస్టమ్​​ను ఇండియా మొత్తంగా పన్నెండు సిటీల్లో ఇన్​స్టాల్​ చేశా. ఇండియాలో ప్రతి రోజు31 బిలియన్​ లీటర్ల గ్రేవాటర్​ బయటకు విడుదలవుతుంది. వేస్ట్​ వాటర్​ రీసైక్లింగ్ సిస్టమ్​ లేకపోవటం వల్ల గ్యాలన్ల కొద్దీ గ్రేవాటర్​ నీటి వనరులను కలుషితం చేస్తోంది. ఇప్పటికే నీటి కొరతతో ఉన్న మనకు ఈ వృథా వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతోంది.

అలాకాకుండా ఉండాలంటే గ్రేవాటర్​ను రీసైకిల్​ చేయాలి. కిచెన్​ సింక్​తో మొదలుపెట్టి షవర్​, వాషింగ్​ మెషిన్​ల నుంచి వచ్చే నీళ్లను రీ సైకిల్​ చేస్తే దాదాపు 40శాతం ఫ్రెష్​ వాటర్​ను ఆదా చేయొచ్చు. రీసైకిల్​ చేసిన నీళ్లను టాయిలెట్​ ఫ్లషింగ్​కు వాడితే... దాదాపు ఆరు లీటర్ల ఫ్రెష్​ వాటర్​ ఫ్లష్​ వాడకానికి ఉపయోగించడం తగ్గుతుంది. వాడకం తగ్గిందంటే ఆదా చేసినట్టే కదా!

వాడకం సులభం

గ్రేవాటర్​ రీసైకిల్ కోసం ఒక సిస్టమ్​ను ఇన్​స్టాల్​ చేయాలంటే ఖర్చుతో కూడుకుంది. ఎక్కువ ఖర్చు కాకుండా మనవాళ్లకు అందుబాటు ధరలో ఉండాలనే ఆలోచనతోనే జల్​సేవక్​ సొల్యూషన్స్ డెవలప్​ చేశా​. అలాగైతే ఎక్కువమంది దీన్ని వాడే అవకాశం ఉంది. ఇది చాలా కాంపాక్ట్​గా ఉంటుంది. అందుబాటు ధరలో ఉన్న ఈ గ్రేవాటర్​ రీసైక్లింగ్​ సొల్యూషన్​ను రెసిడెన్షియల్​, కమర్షియల్​గా వాడొచ్చు. దీన్ని ఎవరైనా ఈజీగా వాడొచ్చు. సస్టెయినబుల్ కూడా. గ్రేవాటర్​ రీసైకిల్​ మెషిన్​ను ఇన్​స్టాల్​ చేసుకునేందుకు అయ్యే ఖర్చు 1.25 లక్షల రూపాయలు.

ఈ ఖర్చు ఇతర వేస్ట్​ వాటర్​ రీసైక్లింగ్ సిస్టమ్​తో పోల్చుకుంటే 30 శాతం తక్కువ. మెయింటెనెన్స్​ కూడా తక్కువే. ఇది రోజూవారీ వాడే నీళ్లలో 75 శాతం నీటి వినియోగాన్ని తగ్గిస్తుంది. ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఇంట్లో 500 లీటర్ల గ్రేవాటర్​ను ఆదా చేయొచ్చు. అలాగే రీసైకిల్​ చేసిన నీళ్లు మళ్లీ వాడడం వల్ల కలుషితమైన నీళ్లు మామూలు నీళ్లలో కలవకుండా కూడా చేస్తున్నట్టే.

కిచెన్​ సింక్​ టు టాయిలెట్స్​

రీసైక్లింగ్ సిస్టమ్​ ఆరు దశలుగా ఉంటుంది​. మొదటి దశలో షవర్స్​, కిచెన్​ సింక్స్​, వాషింగ్​ మెషిన్స్​, వాష్​ బేసిన్​ల నుంచి గ్రేవాటర్​ను సేకరిస్తాం. ఆ గ్రేవాటర్​లో ఘనపదార్థాలు​, మురికి, బురద, కరిగిన సబ్బు, చాలా తక్కువ మొత్తంలో బ్యాక్టీరియా ఉంటుంది. రెండో దశలో గ్రేవాటర్​ పలు పొరల ద్వారా ఫిల్టర్​ అవుతూ ఘనపదార్థాలన్నింటినీ తీసేస్తుంది. దీనిలోని ఫిల్టర్స్​ ఐదు మైక్రాన్​ల సైజ్​ పార్టికల్స్​ను కూడా తొలగిస్తాయి. ఈ ఫిల్టరేషన్​ కోసం ఒక నైలాన్​ బేస్డ్​ స్ట్రెయినర్​ వాడాం. దీన్నుంచి దారాలు, జుట్టు, పేపర్​ వంటి పెద్ద పార్టికల్స్​ వేరవుతాయి. బకెట్​ ఫిల్టర్​ దగ్గర ప్రొపిలీన్​ క్లాత్​ వాడాం. దీనితో నీళ్లలో మిగతా క్లీనింగ్ జరుగుతుంది. ఈ ఫిల్టర్ల ధర 250 రూపాయల వరకు ఉంటుంది. వీటిని వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. ఆరు నెలలకి ఒకసారి మార్చాలి.

ఒక్కో దశలో క్లీన్​ అవుతూ...​

ఇక మూడో దశకు వస్తే...  ఫిల్టర్​ అయిన గ్రేవాటర్​ ఒక టెంపొరరీ ట్యాంక్​లో స్టోర్​ అవుతుంది. నిల్వ చేసిన ఆ నీళ్లను ఎయిరేషన్​ చేయడం వల్ల పాథోజెన్స్​ డెవలప్​ కావు. నాలుగో దశలో ​ నీళ్లను నిల్వ చేసిన ట్యాంక్​ నుంచి రూఫ్​టాప్​ ట్యాంక్​ లోకి ఒక పంప్ ఉంటుంది. దీని ద్వారా నీళ్లు వెళ్తాయి. ఇక్కడ డోసింగ్​ సిస్టమ్​ డిస్​ఇన్ఫెక్టెంట్​ను అవుట్​లెట్​ నీళ్లలో కలుపుతుంది. ఐదో దశలో అదనంగా ఉన్న డిస్​ ఇన్ఫెక్టెంట్​, నీళ్లలో మిగిలిపోయిన సాలిడ్స్​ను   డీక్లోరినేషన్​ అనే ప్రక్రియ ద్వారా తీసేస్తారు. ఇన్ని దశల్లో ట్రీట్​ అయిన గ్రేవాటర్​ను టాయిలెట్​ ఫ్లషింగ్​, ఫ్లోర్​ క్లీనింగ్​, గార్డెనింగ్​కు వాడేందుకు వీలుగా ఒక పైప్​లైన్​ ఏర్పాటుచేస్తాం. గ్రేవాటర్​ను రీయూజ్​ చేసుకునేందుకు ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరంలేదు.

వారం నుంచి రెండు వారాలు​

ఈ సిస్టమ్​ను కడుతున్న ఇళ్లు, భవనా​ల్లో ఇన్​స్టాల్​ చేసేందుకు వారం రోజుల టైం పడుతుంది. అదే ఇప్పటికే కట్టిన ఇళ్లలో అయితే రెండు వారాల టైం కావాలి. ఇల్లు కట్టేటప్పుడు ఈ సిస్టమ్​ను ఇన్​స్టాల్​ చేసుకోవడం బెటర్​. లేదంటే ప్లంబింగ్​ వర్క్​ అంతా చేయించాల్సి ఉంటుంది. అలాగే గ్రేవాటర్​ సేకరించే ట్యాంక్​ని అండర్​గ్రౌండ్​ బేస్​మెంట్​లో పెడతాం. అందుకోసం స్థలం కూడా కావాల్సి ఉంటుంది. రెండేండ్ల క్రితం నోయిడాలోని అపోలో హాస్పిటల్​లో పనిచేస్తున్న డాక్టర్​ ముకుల్​ వర్మ గ్రేవాటర్​ రీసైక్లింగ్​ సిస్టమ్​ను తన కొత్త ఇంటికి పెట్టించుకున్నాడు. ఆ ఇల్లు ఉత్తరాఖండ్​లోని అల్మొరా జిల్లాలో ఉంది.

ఆ ఊళ్లో నీటి సరఫరా అనేది లేదు. వాళ్లు పూర్తిగా వాననీళ్లు లేదా అప్పుడో ఇప్పుడో వచ్చే మునిసిపల్​ వాటర్​ సప్లయ్​ మీద ఆధారపడతారు. ప్రతీ నెలా ఆయన వాళ్ల ఊరికి వెళ్లి, అక్కడ వారం రోజులు ఉంటాడు. అలా వెళ్లినప్పుడు ఇంతకుముందైతే ఎక్కువ నీళ్లు వేస్ట్​ చేస్తున్నానేమో అనే గిల్టీ ఫీలింగ్​ ఉండేది. ఈ సిస్టమ్​ పెట్టుకున్న తరువాత ఆ ఫీలింగ్​ పోయింది. ఎందుకంటే ఒకసారి వాడిన నీళ్లను తిరిగి టాయిలెట్​ ఫ్లష్​, పంటలకు వాడుతున్నాం అని చెప్పాడు ఆ డాక్టరు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది.

పోటీదారులు కావాలి

మామూలుగా అయితే ఏ బిజినెస్​లో అయినా పోటీదార్లు ఉండకూడదు అనుకుంటారు. కానీ నా వరకు కాంపిటీటర్లు ఉంటే బాగుండు అనుకుంటా. ఎందుకంటే ఈ సెక్టార్​ గురించి మాత్రమే పనిచేసే కంపెనీలు లేదా వ్యక్తులు ఎక్కువగా లేరు. ఇలాంటి ప్రొడక్ట్​లు మార్కెట్​లోకి ఇంకా రావాలి. అప్పుడే కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు వస్తాయి. అందుకే ఈ బిజినెస్​లో పోటీదారులను కోరుకుంటున్నా. అపార్ట్​మెంట్స్​లో ఫ్లాట్​ ఓనర్స్​ ఈ సిస్టమ్​ కావాలని అడుగుతున్నారు. ఇలా అడిగే వాళ్లు బాగా ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ సిస్టమ్​ను బిల్డింగ్​ అంతటికీ పెట్టగలం. అలాగైతేనే ఖర్చు కలిసొస్తుంది వాళ్లకు. విడిగా ఒక్కో ఫ్లాట్​కు అంటే ఏర్పాటు చేయడం అంత ఈజీ కాదు.

ప్రత్యామ్నాయాలు అవసరం

ప్రతీ ఏడు వర్షాకాలం కోసం ఎదురుచూసి దానిమీదే ఆధారపడి బతుకుతున్నాం. ఇప్పటివరకు వర్షం మనల్ని మోసం చేయలేదు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల రాబోయే రోజుల్లో పడాల్సిన దానికంటే తక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. మన దగ్గరున్న నీటి వనరులు చాలా పరిమితం. కానీ వాడకం మాత్రం చాలా ఎక్కువ. ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోకపోతే ముందుముందు కష్టం అవుతుంది.’’

ప్రతీ చుక్కా ...

మహారాష్ట్రలో నీటి కొరత ఎక్కువగా ఉండే సోలాపూర్​ జిల్లాలోని బర్షి గ్రామం మాది. శుభ్రమైన నీళ్ల కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లం. మాకు వర్షాలు కూడా తక్కువగా ఉండేవి. దాంతో నా చిన్నప్పుడు చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. అప్పట్లో మాకు 24 గంటలు నీటి సరఫరా లేదు. నేను ఐఐటి మద్రాసులో ఇంజినీరింగ్​ చేశాక పై చదువుల కోసం, జాబ్​  చేసేందుకు అమెరికా వెళ్లా. 2012లో ఇండియాకు తిరిగి వచ్చా. అప్పుడు సొంతంగా ఏదైనా చేయాలనిపించింది. ఇంజినీరింగ్​కి సంబంధించిన​ ఉద్యోగాలు చాలావరకు సర్వీస్​, సేల్స్​ ఫీల్డ్స్​లో ఉన్నాయి.

ఏవీ ప్రొడక్ట్​ బేస్డ్​గా లేవు. నాకు సేల్స్​ ఫీల్డ్​లో ఉద్యోగం చేయడం నచ్చలేదు. సొంతంగా బిజినెస్​ చేయాలనుకున్నా. అప్పటికే నా బుర్రలో వాటర్​ సెక్టార్​ గురించిన ఆలోచనలు ఉండేవి. నా ఆలోచనలకు తగ్గట్టే ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో చాలా వరకు రోజూవారీ అవసరాల కోసం వాటర్​ ట్యాంకర్ల మీద ఆధారపడతారు. అంతేకానీ నీటిని ఆదా చేయడం గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. బాధ్యతగా ఉంటారు.

కార్పొరేట్​ ఉద్యోగం వదిలి...

నిజానికి నీరు అనేది వెలకట్టలేని వనరు. చాలామందికి ఏమవుతుందంటే బటన్​ నొక్కగానే నీళ్లు వస్తున్నాయి. దాంతో వాళ్లకు నీటి సమస్య గురించి తెలియడంలేదు. అలా బటన్​ నొక్కినప్పుడు నీళ్లు రానంతవరకు వాళ్లకు నీటి సమస్య తీవ్రత తెలియదు. అందుకే నీళ్లను రీసైకిల్​ చేసి, రీయూజ్​ చేయడం గురించి ఆలోచించా. పదేళ్ల కార్పొరేట్​ జాబ్​ ఎక్స్​పీరియెన్స్​ తరువాత 2018లో జల్​ సేవక్​ సొల్యూషన్స్​ పెట్టాలనుకున్నా. అంతే మంచి జీతం ఇస్తున్న ఉద్యోగాన్ని వదిలేశా. జలసేవక్​ సొల్యూషన్స్​ పెట్టి రెసిడెన్షియల్​ కాంప్లెక్స్​, ఇండివిడ్యువల్​ హోమ్స్​, అపార్ట్​మెంట్స్​, స్కూల్స్​, హాస్టల్స్​, ఆఫీస్​ క్వార్టర్స్​, పబ్లిక్​ టాయిలెట్స్​లో మొత్తం 25 ప్రాంతాల్లో గ్రేవాటర్​ సిస్టమ్​ ఇన్​స్టాల్​ చేశా. ఇండియా వ్యాప్తంగా చూస్తే ఈ సిస్టమ్స్​ కాన్పూర్​, హైదరాబాద్​, కోయంబత్తూర్​, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, గోరఖ్​పూర్​లతో కలిసి 12 సిటీల్లో ఏర్పాటు చేశాం.