ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం గాలి గోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సమస్త నదీజలాలతో స్నపన తిరుమంజనం చేశారు. ఈ సందర్భంగా హనుమాన్​చాలీసా పారాయణం చేసి తమలపాకులు, నిమ్మకాయలు, అప్పాల మాలలను నివేదించారు. అంతకుముందు ఉదయం రామయ్యకు గర్భగుడిలో తీర్థబిందెను తెచ్చి సుప్రభాత సేవ చేశారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక వరుస క్రమంలో చేసి మంత్రపుష్పం నివేదించారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ చేశారు. 

భక్తి శ్రద్ధలతో సుదర్శన హోమం

యోగానంద లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో మంగళవారం సుదర్శన హోమం జరిగింది. లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈ హోమం నిర్వహించారు. కాగా స్వామి సన్నిధిలో హోమం చేసుకునేందుకు వీలుగా గంజి బాలకృష్ణ దంపతులు, ప్రసాదరాజు దంపతులు ఇత్తడి హోమ గుండాన్ని విరాళంగా అందించారు. అనంతరం స్వామికి ప్రత్యేక హారతులు, నివేదనలు జరిగాయి.

తెరుచుకున్న టీఎస్ఎండీసీ చెక్​ పోస్ట్

భద్రాచలం, వెలుగు: పట్టణ శివారులోని కూనవరం రోడ్డులో ఉన్న తెలంగాణ స్టేట్​ మినరల్స్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​(టీఎస్ఎండీసీ) చెక్ పోస్టు ఎట్టకేలకు తెరుచుకుంది. ఏపీలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక రీచ్​లు ఓపెన్​ కావడంతో పాటు ఇంటర్​ స్టేట్ పర్మిట్లు లేకుండా తెలంగాణలోకి ఇసుక లారీలు వస్తున్నాయి. చెక్​పోస్టు ఉన్నా అలంకార ప్రాయంగా ఉన్నట్లు ఈ నెల 17న వెలుగు దినపత్రిలో వచ్చిన కథనానికి టీఎస్ఎండీసీ ఆఫీసర్లు స్పందించారు. ఇద్దరు స్టాఫ్​ను నియమించారు. వారు చెక్​పోస్టు వద్ద ఇసుక లారీల పర్మిట్లను పరిశీలిస్తున్నారు. ఇదిలాఉంటే స్టాఫ్​కు చెక్​పోస్టులో కనీస సౌకర్యాలు లేకుండా పోయాయి. ఇటీవల వచ్చిన వరదలకు చెక్​పోస్టు పూర్తిగా మునిగి పోయింది. దీంతో చెక్​పోస్టు పక్కనే చెట్టు కింద స్టాఫ్​ కూర్చుంటున్నారు.

మహిళా ప్రాంగణం నిర్వహణ భేష్

ఖమ్మం టౌన్, వెలుగు: మహిళా ప్రాంగణం నిర్వహణ బాగుందని ఉమెన్స్ కార్పొరేషన్  చైర్ పర్సన్  ఆకుల లలిత అభినందించారు. సిటీలోని 8వ డివిజన్ టేకులపల్లి వద్ద ఉన్న మహిళా 
ప్రాంగణాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. ప్రాంగణంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు కల్పించేందుకు జిల్లా ప్రాంగణం అధికారి వేల్పుల విజేత తీసుకుంటున్న చొరవ అభినందనీయమని అన్నారు. ప్రాంగణం డెవలప్​మెంట్​ కోసం నిధులు మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. నర్సింగ్, టైలరింగ్  శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు, అనంతరం కుట్టు మిషన్లను అందజేశారు. నాగ సరస్వతి, స్పందన, మల్లిక, సుకన్య, మంజుల, నవ్య, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.

శాటిలైట్​ సర్వేతో అన్యాయం చేస్తున్రు

ఖమ్మం టౌన్, వెలుగు: శాటిలైట్ సర్వే ఆధారంగా ఆదివాసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సిటీలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో పొజిషన్ లో ఉన్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.14 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 3.5 లక్షల అప్లికేషన్లను మాత్రమే ఆమోదించారని తెలిపారు. ఎన్నికల కోసం ఆదివాసీలను మోసం చేయవద్దని అన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, రైతుల రుణాలను మాఫీ చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆవుల వెంకటేశ్వర్లు, జి రామయ్య, సీవై పుల్లయ్య, ఆవుల అశోక్, గుర్రం అచ్చయ్య, బందెల వెంకయ్య పాల్గొన్నారు.

మత్స్యకారులకు అండగా సర్కార్

ములకలపల్లి, వెలుగు: మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటోందని జిల్లా మత్స్యశాఖ అధికారి బి వీరన్న, జడ్పీటీసీ సున్నం నాగమణి అన్నారు. మంగళవారం మండలంలోని మూకమామిడి ప్రాజెక్టుతో పాటు ఈదులవాగు, రాళ్లవాగు, నల్ల చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేశారు. ఉప సర్పంచ్ తమ్మిశెట్టి లక్ష్మి, కార్యదర్శి అరుణ్ కుమార్, మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్  కోటేశ్వరరావు, మండల ఇన్​చార్జి ఎం మంగరాజు, భార్గవ్, అనిల్, మూకమామిడి ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వట్టం శ్రీను, కొరస నాగేశ్వరరావు పాల్గొన్నారు.

అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదు

వైరా, వెలుగు: వైరా గ్రామపంచాయతీ పరిధిలో తప్పుడు పత్రాలతో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, దీనిపై విచారణ చేయాలని మంగళవారం సబ్ రిజిస్ట్రార్  రామ్​కుమార్​కు వినతిపత్రం అందజేశారు. వైరా మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో జారీ చేసిన పత్రాలతో వేలాదిగా రిజిస్ట్రేషన్లు జరిగాయని, వాటిపై విచారణ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామస్తులు కర్నాటి హనుమంతరావు, దొంతబోయిన చింతయ్య, ఎస్కే సైదులు, పూర్ణ కంటి లక్ష్మయ్య, బొల్లెపోగు శ్రీను, ప్రభుదాస్, మేరుగ ప్రసాద్, తుడుం రమేశ్​ పాల్గొన్నారు.

ఉమెన్స్ కాలేజీలో ఓరియంటేషన్ డే

ఖమ్మం టౌన్, వెలుగు: సిటీలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో మంగళవారం  టీఎస్ కేసీ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ డే నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. జి.పద్మావతి, టాస్క్  రీసోర్స్ పర్సన్ బాలు పలు అంశాలను వివరించారు. ఇంటర్వ్యూ స్కిల్స్, సాఫ్ట్ వేర్  కోర్స్ కు సంబంధించి హెచ్ టీఎంఎల్, డీబీఎంఎస్, జావా, ట్యాలీ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. టీఎస్ కేసీ కో ఆర్డినేటర్ కె నరసింహారావు, సీహెచ్  కవిత పాల్గొన్నారు.

రేంజర్  హత్యకు ప్రభుత్వ తీరే కారణం

ఖమ్మం టౌన్, వెలుగు: చండ్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో రేంజర్ శ్రీనివాస్  హత్యకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీరే కారణమని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. పోడు భూములను దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో హరితహారం పేరుతో లక్షలాది మొక్కలు నాటించారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడం కోసం వెళ్లిన ఆఫీసర్లకు ఈ పరిస్థితి ఎదురైందని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానని ప్రకటించాలని డిమాండ్​ చేవారు. అటవీశాఖ అధికారులు గిరిజనుల భూముల్లో మొక్కలు నాటకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం

కూసుమంచి, వెలుగు: ప్రభుత్వం ధరణి పోర్టల్, పోడు భూములకు పట్టాల పేరుతో రైతులను మోసం చేస్తోందని పీసీసీ సభ్యుడు రాయల నాగేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు, రైతుల సమస్యలపై ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్​ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. 25న నియోజకవర్గాల్లో, వచ్చే నెల 5న కలెక్టరేట్​ ఎదుట ధర్నాలు చేపడతామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వరరావు, ఎండీ హఫీజుద్దీన్, మంకెన వాసు, దాసరి శ్రీను, రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ బొందయ్య, బొల్లికొండ శ్రీనివాస్, పెండ్ర అంజయ్య, తుపాకుల వెంకన్న, షేక్ మీరా  పాల్గొన్నారు.

ఉర్సు ఉత్సవాలు షురూ

ఇల్లందు, వెలుగు: మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే హజరత్ నాగుల్ మీరా మౌలా చాంద్ దర్గా షరీఫ్ ఉర్సు ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పట్టణంలోని నెంబర్–2 బస్తీలోని  హజరత్ ఖాసిం దుల్హా దర్గా షరీఫ్  నుంచి సందల్, చాదర్​లను పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. బుధవారం ఉదయం 8 గంటలకు  నెంబర్–2 బస్తీ హజరత్ ఖాసీం దుల్హా దర్గా షరీఫ్ నుంచి డప్పు వాయిద్యాలు, కోలాటాలు, కొమ్ము డప్పు కళాకారులు, గుర్రపు బగ్గీలు, ఒంటెలపై జెండాలతో విగ్రహాలను హజరత్ నాగుల మీరా మౌలా చాంద్  దర్గా షరీఫ్ కు తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.