ప్రైవేట్ హాస్పిటళ్లలో అబార్షన్ల దందా.. యథేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు

ప్రైవేట్  హాస్పిటళ్లలో అబార్షన్ల దందా.. యథేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు

 

వనపర్తి/పెబ్బేరు, వెలుగు:  వనపర్తి జిల్లాలోని కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ లో యథేచ్చగా అబార్షన్ల  దందా కొనసాగుతోంది. ఆర్ఎంపీ డాక్టర్లు మీడియేటర్లుగా వ్యవహరిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఆడపిల్ల అని తేలితే భారీగా డబ్బులు గుంజి అబార్షన్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. డబ్బుల ఆశతో అనుభవం, అర్హత లేనివారు అబార్షన్లు  చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. ఇంత జరుగుతున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. 

పెబ్బేరులో దోపిడీ..

హైవేకి దగ్గరగా పెబ్బేరు పట్టణంలోని ప్రైవేట్​ ఆసుపత్రుల్లో పేదల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక్కడ గర్భిణులకు స్కానింగ్​ చేసి గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు అబార్షన్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాకేంద్రంలోని నర్సింగ్ హోమ్​లు, పాలిక్లినిక్ లు, అనుమతి లేని హాస్పిటళ్లలో అర్హత లేని వైద్యులు సైతం సిజేరియన్లు, అబార్షన్లు చేస్తున్నారని అంటున్నారు. రెండు నెలల కింద జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్​ హాస్పిటల్ లో  డెలివరీ కోసం వచ్చిన ఒక మహిళ చనిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు ధర్నా చేయగా, అక్కడి పెద్ద మనుషులు, డాక్టర్లతో సెటిల్​మెంట్  చేసి పరిహారం ఇప్పించారు. 

ఇలాంటి ఘటనలు మామూలే..

పెబ్బేరు మున్సిపాలిటీకి చెందిన ఓ మహిళ 20 ఏండ్ల తరువాత గర్భం దాల్చింది. వనపర్తికి వెళ్లగా, అక్కడి డాక్టర్లు హైదరాబాద్, మహబూబ్​నగర్, కర్నూల్​కు తీసుకెళ్లాలని సూచించారు. అంత దూరం వెళ్లలేక వారు పెబ్బేరులో పేరున్న హాస్పిటల్ కు తీసుకెళ్తే అక్కడి డాక్టర్​ తాను వైద్యం చేస్తానని చెప్పి ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి అబార్షన్ చేశాడు. నెలలు నిండకపోవడంతో శిశువు చనిపోయింది. ఏవో కారణాలు చెప్పి మహిళను ఆసుపత్రి నుంచి పంపించిన ఆ డాక్టరు పెద్దమనుషులతో కలిసి ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. ఇలాంటి ఘటనల గురించి వైద్యారోగ్య శాఖ ఆఫీసర్లకు తెలిసినా డాక్టరుపై, ప్రైవేట్​ హాస్పిటల్​పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఇష్టారీతిన పర్మిషన్లు..

ప్రైవేట్​ హాస్పిటల్స్  యాజమాన్యాల నుంచి వైద్యారోగ్య శాఖ అధికారులు మామూళ్లు తీసుకుంటూ రూల్స్  పక్కన పెట్టి నర్సింగ్ హోమ్, క్లినిక్ లకు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రైవేట్  ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్​ డాక్టర్ల పేర్లతో బోర్డులు పెట్టి ఎంబీబీఎస్, ఆర్ఎంపీలు, పీఎంపీలు కాన్పులు, అబార్షన్లు చేస్తున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. సరైన వైద్యం అందక చనిపోయిన వారి కుటుంబాలను డబ్బులు లేదంటే రాజకీయ పలుకుబడితో లొంగదీసుకుంటూ ఫిర్యాదులు చేయకుండా చూసుకుంటున్నారని చెబుతున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చేతులు దులుపుకుంటున్నారు. వనపర్తి జిల్లాలో ఆరు నెలలుగా నామమాత్రపు తనిఖీలు చేసి రెండు, మూడు ఆసుపత్రులను సీజ్  చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలున్నాయి. సీజ్ అయిన హాస్పిటల్స్  స్థానంలో మరో పేరుతో పర్మిషన్​ తీసుకొని మళ్లీ ఈ దందాకు  తెర లేపుతున్నారు.

విచారణ చేపట్టాం..

అబార్షన్లు చేయడం, అర్హత లేని వారు కాన్పులు చేయడం, పుట్టేది ఆడ, మగ అని చెప్పడం చట్టరీత్యా నేరం. అబార్షన్లకు సంబంధించిన సమాచారం వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. పెబ్బేరులో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. విచారణ చేపట్టాం. బాధితులు ఎవరన్నది ఇంకా తేలలేదు. పూర్తి వివరాలు సేకరించి తప్పు జరిగినట్లు తేలితే యాక్షన్ తీసుకుంటాం. 


రవిశంకర్, డీఎంహెచ్​వో, వనపర్తి