నా గొడవ.. కాళోజీ కవిథలు

నా గొడవ.. కాళోజీ కవిథలు

నిజాం 1939లో ప్రవేశపెట్టిన ఇస్లహాద్ (రాజ్యాంగ సవరణలు) వల్ల హైదరాబాద్ సంస్థానంలో వృత్తుల ప్రాతిపదికన ఎన్నికలు జరిగి ప్రతినిధులతో ఏర్పడ్డ మంత్రివర్గం అసెంబ్లీకి బాధ్యత వహించదు. దాని ఏర్పాటు, ఉనికి, మనుగడ కేవలం నిజాం ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ‘ఇస్లహాద్’ మత పక్షపాత వైఖరి కలిగినది. ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది. ‘స్టేట్ కాంగ్రెస్’ బహిష్కరించిన, మేధావులు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించిన ఈ సంస్కరణలను కాళోజీ కూడ “ఇష్టప్రకారం చేసేదానికి / ఇస్లహాద్ ఎందులకు? । దుష్టులు చేసే దౌర్జన్యాలకు /దోహదమిచ్చే దెందులకు? । కుయ్యొమొర్రో అను బీదసాదలకు / కర్ర దెబ్బలవి యెందులకు? । కత్తులు దూసి వచ్చేవారితొ /మెత్తని మాటలు ఎందులకు?” అంటూ ఖండించాడు. ఈ ఎన్నికల్లో ఇంటి యజమానుల ప్రతినిధిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బలదేవ్ పతంగేకు ప్రజల సమస్యల గూర్చి మాట్లాడే అవకాశం లేని నిజాం అసెంబ్లీలో ఉండి ప్రయోజనం లేదని చెప్పడమే కాక కవిత్వ రూపంలో పత్రికాముఖంగా ప్రకటించినాడు. “పాడు సంస్కరణలకు బ్రమసిపోయిన నేటి / బలదేవుడే తిరిగి బైట పడకుండునా” అని కాళోజీ అన్నట్లుగానే పతంగే రెండు నెలలకే రాజీనామా చేశాడు. పట్టెదార్ల తరపున ప్రతినిధిగా ఎన్నికైన పింగిళి వెంకట్రాంరెడ్డి (వీరు డిప్యూటీ ప్రైం మినిస్టర్​గా కూడ నియమితులయ్యారు) ని కూడ “మూతికున్న బుట్టి గానక । మూతలేదని వట్టి కుండలో/ మూతి పెట్టి జుర్రుకొనుటకు । మోజు పడినావా యింతగ” అని ఎద్దేవా చేశాడు. మేధావుల ప్రతినిధిగా ఎన్నికైన జస్టిస్ లక్ష్మారెడ్డిని కూడ నిజాం అసెంబ్లీలో కొనసాగవద్దని, ‘‘కుర్చి దొరికినదంచు/ కులుకుచున్నావా? । ఏమి ఎరుగని నీవు ఎలగబెట్టేదేమి । శాసనసభలోన తెలియజేసెదవా?” అని సూటిగా ప్రశ్నించాడు.

1944 సం.లో జనగామ, నల్లగొండ ప్రాంతాలలో రైతు కూలీలపై అణచివేతలకు, ప్రత్యేకించి ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి పైన జరిగిన దౌర్జన్యకర సంఘటనలకు ప్రతిస్పందించి ‘‘కంచెయె చేనును మేయుచుండగా। కాంచకుండు టింకెన్నాళ్లు / దొంగలు దొంగలు ఊళ్లు పంచుకొని / దొరలై వెలిగే దెన్నాళ్లు / బాధలు పెట్టి పలుకనీయని / పాపుల భయమింకెన్నాళ్లు / పగటి దోపిడుల నాపగలేని / ప్రభుత్వముండే దెన్నాళ్లు । దౌర్జన్యం ఎదిరించక మనకీ / దాసోహం ఇంకెన్నాళ్లు” అంటూ ప్రతిఘటించడం నేర్పాడు.1944 సం।।లో వరంగల్​లో సారస్వత పరిషత్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించ దలుచుకున్న కవి సమ్మేళన ఏర్పాట్లను రజాకార్లు ధ్వంసం చేసి వెళ్తే, కాలి కూలిన పందిళ్ల చోటనే కవిసమ్మేళనం విజయవంతంగా జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి, గార్లపాటి రాఘవరెడ్డి, దాశరథి, కాళోజీ మొదలైన 60 మంది కవులు కావ్యగానం చేశారు.

1946 సం।।లో వరంగల్ కోటలో హయగ్రీవాచారి నాయకత్వంలో జరుప తలపెట్టిన జాతీయ పతాకావిష్కరణోత్సవాన్ని ఆపాలని రజాకార్లు నానా బీభత్సం సృష్టించారు. వారిపై వీరోచితంగా పోరాడిన మొగిలయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ సందర్భంలోనే శబ్దానుశాసన గ్రంథాలయ వేదికపై నిలుచున్న పసిబాలుని పొడిచి అతని ప్రేగులను కత్తులకు తగిలించి ఊరేగారు. మరికొంతకాలానికి డా।। నారాయణరెడ్డి అనే వైద్యుని కూడ పాశవికంగా హత్య చేశారు. ఈ రజాకార్ల అమానుష చర్యలను నిరసిస్తూ కాళోజీ ‘నగ్నసత్యాలు’ కవిత రాశాడు. “రక్షణకు ఏర్పడ్డ బలగము / రక్కసుల పక్షంబు చేరిన / రాక్షసుల ఇష్టానుసారం । రాజ్యమును నడిపించిన / పట్టపగలే పట్టణంలో పట్టి / పౌరుల కొట్టి చంపిన” తీరును ఖండించాడు.1946 సం।।లో కమ్యూనిస్ట్ పార్టీని నిజాం ప్రభుత్వం నిషేధించినప్పుడు ‘‘ప్రజాసంస్థపై పగ సాధించిన / ఫలితము తప్పక బయటపడున్ / నిక్కుచు నీళ్లే నిరంకుశత్వము / నిల్వలేక నేలను గూలున్” అని రాశాడు.

15–2–1947న బూర్గుల రామకృష్ణారావుకు నైజాం మంత్రివర్గంలో చేరడానికి ఆహ్వానం రాగా తిరస్కరించాడు. ఆయన స్వాభిమానానికి అభినందిస్తూ కాళోజీ ‘గట్టి గుండె గలవాడు’ అనే కవితలో “తెలుగు వారు తలలనెత్తి / తిరుగునట్లు చేసినావు” అని రాశాడు.1948 సం।।లో గుల్బర్గా జైల్లో ఉన్నప్పుడు రజాకార్లు జనగాం తాలూకాలోని బైరాన్‌‌పల్లి గ్రామ ప్రజలపై మూకుమ్మడిగా జరిపిన అత్యాచారాల వార్తలను చదివి ఆవేదన చెందిన కాళోజీ “మన కొంపలార్పిన మన స్త్రీల చెరిచిన / మన పిల్లలను చంపి మనల బంధించిన / మానవాధములను మండలాధీశులను/ మరచిపోకుండగ గురుతుంచుకోవాలె / కసి ఆరిపోకుండ బుస కొట్టుచుండాలె / కాలంబు రాగానె కాటేసి తీరాలె / తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలె / కొంగు లాగిన వ్రేళ్ల కొలిమిలో పెట్టాలె / కన్ను గీటిన కళ్ల కారాలు చల్లాలె/ కండ కండకు కోసి కాకులకు వెయ్యాలి” అని ఆక్రోశించాడు. ఇవన్నీ కాళోజీ ‘నా గొడవ’లో నిక్షిప్తం. తెలంగాణ ప్రజలందరికీ ఈ గ్రంథం అవశ్యం పఠనీయం.
–ఎ. గజేందర్ రెడ్డి, 9848894086