
- భూపాలపల్లికి చెందిన జనరల్ మజ్దూర్ యూనియన్ లీడర్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఆఫీసర్లు
- బ్యాంక్ అకౌంట్లు, సెల్ఫోన్ సీజ్
జయశంకర్ భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్, వెలుగు: సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసిన భూపాలపల్లికి చెందిన సింగరేణి ఉద్యోగి, జనరల్ మజ్దూర్ యూనియన్ లీడర్ సదరాల ప్రశాంత్ ను బుధవారం ఖమ్మం ఏసీబీ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. భూపాలపల్లిలోని ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని, ప్రశాంత్ బ్యాంక్ అకౌంట్లు, సెల్ ఫోన్ సీజ్ చేసి ఖమ్మం కోర్టులో హాజరు పరిచారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని మెయిన్ వర్క్ షాప్లో డ్రైవర్ గా పని చేస్తున్న అన్నెబోయిన రాజేశ్వర్రావుతో పాటు మరికొందరు కలిసి కారుణ్య నియామకాల్లో భాగంగా మెడికల్ బోర్డు నుంచి అన్ఫిట్ సర్టిఫికెట్ ఇపిస్తామని, ట్రాన్స్ఫర్స్, పేరు మార్పు చేయిస్తామని చెప్పి పలువురి వద్ద రూ.32 లక్షలు వసూలు చేశారు.
ఈ విషయంపై విచారణ చేసిన సింగరేణి విజిలెన్స్ ఆఫీసర్లు కొద్ది రోజుల కింద ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ విచారణలో రూ.32 లక్షల కంటే ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. పేరు మార్పుకు సంబంధించి ఒకరి నుంచి రూ.3 లక్షలు తీసుకున్నట్లు తేలింది. బాధితులను విచారించి అక్రమాలు నిజమేనని తేలడంతో కొద్ది రోజుల కింద రాజేశ్వర్రావును అరెస్ట్ చేశామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సింగరేణిలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, డిపెండెంట్ ఉద్యోగాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడిన ముఠాలో ప్రశాంత్ కూడా ఉన్నట్లు తేలడం, అతడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం రేపింది.