- బీజేపీ అభ్యర్థులు గెలిచి, ఈటల మద్దతుదారులు ఓడారంటూ...
- సోషల్ మీడియాలో బండి వర్గం పోస్టులు
హనుమకొండ, వెలుగు : పంచాయతీ ఎన్నికల సాక్షిగా బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ , ఎంపీ ఈటల రాజేందర్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా ఈటల, బండి వేర్వేరుగా బలపర్చిన అభ్యర్థులు పోటీలో నిలబడటం, ఈటల వేరు.. బీజేపీ వేరు అన్నట్టుగా బండివర్గం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది. తాను బీజేపీ ఎంపీనని, అవగాహన లేని పిచ్చోళ్లు పోస్టులు పెడుతున్నారంటూ ఈటల కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే హుజూరాబాద్ సెగ్మెంట్ లో తొలిదశ పంచాయతీ ఎన్నికల్లోనే ఇద్దరు నేతల మధ్య పంచాయితీ తీవ్ర స్థాయికి చేరింది. రెండు, మూడో విడతల్లో పార్టీ బలపరిచే అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు.
చెరో అభ్యర్థికి సపోర్ట్..
హనుమకొండ జిల్లాలో హుజురాబాద్ సెగ్మెంట్ కమలాపూర్ మండలంలో తొలిదశ జరిగిన ఎన్నికల్లో 24 పంచాయతీలు ఉండగా.. కొత్తపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థి సర్పంచ్ గా ఏకగ్రీవం అయ్యారు. కమలాపూర్ ఈటల రాజేందర్ సొంతూరు. కాగా.. మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆయన పోటీలో నిలిపారు. మరోవైపు బండి సంజయ్ వర్గం నేతలు కూడా బరిలో నిలిచారు. కమలాపూర్ మండలం ఉప్పల్ పల్లి, పంగిడిపల్లి, గుండేడు, శ్రీరాములపల్లి, నేరెళ్లలో ఇద్దరేసి క్యాండిడేట్లు బీజేపీ మద్దతుతో పోటీ చేశారు. ఉప్పల్ పల్లి, పంగిడిపల్లిలో చెరో అభ్యర్థికి సపోర్ట్ చేయగా.. బండి సంజయ్ బలపర్చిన నేతలు గెలుపొందారు. కమలాపూర్, గూడూరు, గుండేడు, శనిగరం, గునిపర్తిలో ఈటల రాజేందర్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఒకే పంచాయతీలో చెరో అభ్యర్థిని బలపర్చగా, కొన్నిచోట్లా ఫలితాలు కూడా తారుమారయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శ్రీరాములపల్లి, నేరెళ్లలో కూడా బండి, ఈటల బలపర్చిన నేతలు బరిలో పోటీ చేయగా.. శ్రీరాములపల్లిలో బీఆర్ఎస్, నేరెళ్లలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచారు.
సోషల్ మీడియాలో మెసేజ్ లు..
సోషల్ మీడియాలో ఈటల వేరు, బీజేపీ వేరు అన్నట్టుగా బండి సంజయ్ పీఆర్వోతో పాటు మరికొందరు నేతలు మెసేజ్ లు పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. కమలాపూర్ మండలం ఉప్పల్ పల్లిలో ర్యాకం శ్రీనివాస్ గెలుపొందగా.. ఆయన బండి సంజయ్ ఆశీస్సులతో గెలుపొందాడని, ఈటల రాజేందర్ బలపర్చిన అభ్యర్థి ఓడిపోయారని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. పంగిడిపల్లిలో సమీప ప్రత్యర్థి, ఈటల రాజేందర్ బలపర్చిన అభ్యర్థిపై బీజేపీ బలపర్చిన అభ్యర్థి గెలిచారంటూ పోస్టులు పెట్టారు. అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరి నడుమ తలెత్తిన విభేదాలకు సాక్ష్యంగా నిలిచాయి. కమలాపూర్ లో ఈటల రాజేందర్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి పబ్బు సతీశ్ ను ఓడించేందుకు బండి సంజయ్ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదే విషయమై కమలాపూర్ లో ఈటల రాజేందర్ స్పందించారు. తాను బీజేపీ ఎంపీనని, అవగాహన లేని పిచ్చోళ్లు పోస్టులు పెడుతున్నారని, దాన్ని పార్టీ చూసుకుంటుందని కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
అభ్యర్థుల్లో గందరగోళం
మూడో విడతలో ఇల్లందకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, వి.సైదాపూర్, వీణవంక మండలాల్లో ఎన్నికల్లో జరగనున్నాయి. నియోజకవర్గంలో చాలాచోట్ల ఈటలకు అనుచరవర్గం ఉండగా సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. బండి సంజయ్ వర్గం నేతలు కూడా పోటీలో నిలిచారనే టాక్ ఉంది. దీంతో ఇద్దరు నేతల మధ్య పంచాయితీతో బరిలో నిలిచిన అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. సంజయ్, రాజేందర్ మధ్య పంచాయితీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
