ఆసిఫాబాద్ ఇన్చార్జి డీసీవో రూ.2 లక్షలు లంచం తీసుకోగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ACB

ఆసిఫాబాద్ ఇన్చార్జి డీసీవో రూ.2 లక్షలు లంచం తీసుకోగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ACB

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ లంచం డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆదిలాబాద్​ఏసీబీ డీఎస్పీ మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ రాథోడ్ బిక్కు కుమ్రం భీమ్​ఆసిఫాబాద్ జిల్లా ఇన్​చార్జి డీసీవోగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ పీఏసీఎస్​ సెక్రటరీ జక్కుల వెంకటేశంగౌడ్ సొసైటీ నిధుల అక్రమాలపై 2020లో సస్పెండ్​ కాగా.. పోస్టింగ్ ​ఇవ్వలేదు.

2024లో బెజ్జూర్​పీఏసీఎస్​లో అక్రమాలు జరిగినట్టు తేలడంతో అదే ఏడాది నవంబర్​లో ఇన్​చార్జి సెక్రటరీ సంజీవ్​తో పాటు వెంకటేశం గౌడ్​ కూడా సస్పెండ్​అయ్యారు. కాగా ఆయనకు రావాల్సిన సగం జీతం ఆపడమే కాకుండా జీవో.44ను అమలు చేయలేదు. డబ్బుల చెల్లింపుతో పాటు సస్పెన్షన్​ఎత్తివేతకు ఇన్​చార్జి డీసీవో రాథోడ్​బిక్కును వెంకటేశంగౌడ్ సంప్రదించారు. రూ.10 లక్షలు డిమాండ్​ చేయగా రూ.5లక్షలకు ఒప్పుకున్నాడు. తొలి విడతలో రూ.2లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడు. అనంతరం బాధితుడు ఏసీబీకి కంప్లయింట్ చేశాడు.

మంచిర్యాలలోని ఇక్బాల్​ అహ్మద్​ నగర్​లో రాథోడ్ బిక్కు ఇంట్లో వెంకటేశం గౌడ్​ శనివారం లంచం డబ్బులు రూ. 2లక్షలు అందజేశాడు. ఆదిలాబాద్​ఏసీబీ డీఎస్పీ మధు సిబ్బందితో దాడి చేసి రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అనంతరం కలెక్టరేట్​లోని  ఆఫీసుకు తీసుకెళ్లి విచారించారు. ఆయనను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీపీ తెలిపారు. మరోవైపు ఇచ్చోడలోని బిక్కు ఇంట్లో ఏసీబీ రైడ్స్ చేశారు. రాథోడ్ బిక్కు గతంలో ఆసిఫాబాద్​ ఇన్​చార్జి డీసీవోగా పనిచేస్తూ ప్రమోషన్​పై మంచిర్యాల డీసీవోగా గత సెప్టెంబర్​ లో బాధ్యతలు చేపట్టారు. గతంలో సస్పెండైన మరో సెక్రటరీ నుంచి కూడా రూ.9 లక్షలు తీసుకుని జాబ్ ఎక్కేందుకు ఆర్డర్ ఇచ్చినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.