షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల ఎంపీడీవో, ఎంపీవో, మరో గ్రామ సెక్రటరీ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. మండలంలోని ఇదులపల్లి గ్రామంలో నాలుగు ప్లాట్లలో బిల్డింగ్ పర్మిషన్ కోసం ఓ వ్యక్తి వద్ద ఎంపీడీవో సుమతి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు.
మొదటి విడతగా రూ.లక్షా 50 వేలు తీసుకుంది. మిగతా రూ.50 వేలు బుధవారం నందిగామ ఎంపీవో తేజ సింగ్, ఇదులపల్లి జీపీ సెక్రటరీ ఆవుల చెన్నయ్యతో కలిసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. అనంతరం ఎంపీడీవో ఇంట్లో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
బాగ్‌అంబర్‌పేట్‌లో దేవాదాయ ఇన్‌స్పెక్టర్..
బషీర్‌బాగ్: లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు వేర్వేరుగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బాగ్ అంబర్‌పేట్‌లోని సుమారు 1200 గజాల భూమి దేవాదాయ శాఖ పరిధిలోకి రాదని నిర్ధారిస్తూ సర్వే నిర్వహించాలని ఫిర్యాదుదారుడు దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ అక్కవరపు కిరణ్ ను కోరాడు. అందుకు ఆయన రూ.2 లక్షలు లంచం అడిగారు.
చివరికి రూ.1.50 లక్షలు తీసుకునేందుకు అంగీకరించాడు. బుధవారం అబిడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయం సమీపంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
