 
                                    - లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన యాదగిరిగుట్ట
- ఎలక్ట్రికల్ ఈఈ రామారావు
యాదగిరిగుట్ట/ఎల్బీనగర్ వెలుగు: లంచం తీసుకుంటూ పట్టుబడిన యాదగిరిగుట్ట దేవస్థాన ఎలక్ట్రికల్ ఈఈ రామారావు ఇంటితో పాటు ఆఫీస్‌లో ఏసీబీ ఆఫీసర్లు 15 గంటల పాటు సోదాలు నిర్వహించారు. బుధవారం ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 1.90 లక్షలు తీసుకుంటుండగా ఈఈని ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. తర్వాత ఈఈని గుట్టలోని ఈఈ ఆఫీస్‌కు తీసుకొచ్చి సోదాలు ప్రారంభించారు.
ఓ టీమ్ యాదగిరిగుట్ట ఈఈ ఆఫీస్‌లో సోదాలు చేస్తున్న టైంలోనే.. మరో రెండు టీమ్స్ ఎల్బీనగర్ శివగంగ కాలనీలోని ఈఈ ఇంట్లో సోదాలు చేశారు. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు సోదాలు చేసిన ఆఫీసర్లు పలు రికార్డులు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
సోదాలు పూర్తి కావడంతో రామారావును ఎల్బీనగర్‌లోని అతడి ఇంటికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ ఆఫీసర్లు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న రికార్డులు, డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ కొనసాగుతుందని నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్ర వెల్లడించారు.

 
         
                     
                     
                    