చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

స్కిల్ డెవ్ లప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.  ఇవాళ ఉదయం(సెప్టెంబర్ 10) 8 గంటల నుంచి వాదోపవాదనలు విన్న కోర్టు.. సీఐడీ వాదనలతో ఏకీభవించింది. దీంతో  చంద్రబాబుకు  14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. దీంతో చంద్రబాబు సెప్టెంబర్ 22 వరకు రిమాండ్ లో ఉండనున్నారు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్టు  ఆదేశించింది. దీంతో పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. మరో వైపు రాష్ట్రం వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేయాలంటూ ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు

చంద్రబాబు కేసుపై ఏసీబీ కోర్టులో  సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి,  చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్  లూథ్రా దాదాపు ఏడున్నర గంటలు  వాడివేడీగా వాదనలు వినిపించారు.   

చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు

చంద్రబాబుపై సెక్షన్ 409 నమోదు చేయడంపై   సిద్దార్ధ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందుగా సాక్ష్యం చూపించాలని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు అరెస్టు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలి  కానీ..  సీఐడీ ఆ పని చేయలేదన్నారు . ఇది చట్ట విరుద్ధమని లూథ్రా కోర్టులో వాదించారు.చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని లూథ్రా కోర్టుకు తెలిపారు.

ALSOREAD:విజయవాడలో హై అలర్ట్.. భారీగా పోలీసుల మోహరింపు

సీఐడీ  వాదనలు 

 చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి  కోర్టును కోరారు. చంద్రబాబును 24 గంటల్లోపూ కోర్టులో ప్రవేశ పెట్టామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 2015లో విడుదలైన జీవో నెంబర్ 4తో కుట్ర జరిగిందన్నారు. చంద్రబాబు అరెస్ట్ కు గవర్నర్ అనుమతి అవసరం లేదని చెప్పారు. మాజీ సీఎం గౌరవప్రదమైన హోదా మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు ప్రస్తుత హోదా జస్ట్ ఎమ్మెల్యే  అని చెప్పారు. 

స్కిల్ డెవ్ లప్ మెంట్ స్కీంలో రూ.271 కోట్లు దారిమళ్లించారని చంద్రబాబుపై సీఐడీ అభియోగం మోపింది. దీంతో చంద్రబాబును సెప్టెంబర్ 9న ఉదయం 6 గంటలకు నంద్యాలలో  అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ సిట్ ఆఫీస్ కు తరలించారు. అక్కడ సీఐడీ అధికారులు చంద్రబాబును రాత్రంతా విచారించారు. ఇవాళ(సెప్టెంబర్ 10)న కోర్టులో ప్రవేశ పెట్టారు.