రూ.7 వేల లంచం కేసులో.. 11 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల జైలు శిక్ష

రూ.7 వేల లంచం కేసులో.. 11 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల జైలు శిక్ష

లంచగొండి వీర్వోకు కరీంనగర్ ఏసీబీ కోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. 11 ఏళ్ల క్రితం లంచం తీసుకున్న కేసులో వీర్వో అడపా శ్రీనివాస్ కు  కరీంనగర్ ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కుమార్ వివేక్ జైలు శిక్ష, జరిమానా విధించారు. 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో 2012 డిసెంబరు 5న  అడపా శ్రీనివాస్  అనే అప్పటి వీఆర్వో.. ఓ భూమి జమాబంధి కోసం రూ. 7 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. అయితే జులై 20వ తేదీ 2023న ఈ కేసులో  నేరం రుజువు కావడంతో అడపా శ్రీనివాస్ కు   వేర్వేరుగా రెండు శిక్షలు ఖరారు చేశారు కరీంనగర్ ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కుమార్ వివేక్. 

ఓ కేసులో నాలుగేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.  8 వేల జరిమానా విధించారు. అలాగే మరో సెక్షన్ కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 6 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. మొత్తంగా 
రూ. 14 వేల జరిమానాతో పాటు.. రెండు కఠిన కారాగార శిక్షల్లో ఎక్కువ కాలం పడిన 4 ఏళ్ల శిక్ష అమలు చేస్తారు.