రూ.30వేల లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్సై

రూ.30వేల లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్సై

కర్నూలు :  పోలీస్ సర్టిఫికెట్ కావాలని వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ. 30,000 తీసుకుంటూ ఓ ఎస్సై, కానిస్టేబుల్  ఏసీబీ అధికారులకు చిక్కారు.  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా గోస్పాడు మండలం కనాలపల్లికి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి  తన కొడుకు ట్రాన్సఫర్ సర్టిఫికెట్ కోసం పోలీసుల సాయం కోరాడు. మధ్యలో చదువు ఆపేసిన తన కొడుకు ప్రైవేటుగా పదవ తరగతి పరీక్షలు రాయడానికి  పోలీస్ సర్టిఫికెట్ కావాల్సి వచ్చింది.

ఇందుకోసం గోస్పాడు పీఎస్ కు వెళ్లగా..  ఆ సర్టిఫికెట్ ను జారీ చేసేందుకు ఎస్సై చంద్ర శేఖర్ రెడ్డి రూ.30,000 డిమాండ్ చేశాడు.  ఒప్పందం ప్రకారం పుల్లయ్య డబ్బు తీసుకు రావడంతో  ఎస్సై..  కానిస్టేబుల్ హరనాధ్ కు ఆ డబ్బును తీసుకోవాల్సిందిగా చెప్పాడు. ఆదివారం ఉదయం 10:45 గంటల సమయంలో గోస్పాడు పీఎస్ లో పుల్లయ్య కానిస్టేబుల్ కు డబ్బు ఇస్తుండగా..  ప్లాన్ ప్రకారం ఏసిబి అధికారులు అతన్ని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. కానిస్టేబుల్ తో పాటు,  లంచం డిమాండ్ చేసిన ఎస్సైని కూడా  అధికారులు పట్టుకున్నారు.