
- తలసాని మాజీ ఓఎస్డీ కల్యాణ్, పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈవో రాంచందర్ అరెస్ట్
- కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలింపు
- ఇప్పటికే 8 మంది అధికారుల అరెస్ట్
హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో అమలుచేసిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో భారీ కుంభకోణం బయటపడింది. ఈ స్కీమ్‌లో రూ. 700 కోట్లు దారిమళ్లినట్టు ఏసీబీ అధికారులు తాజాగా గుర్తించారు. ఈ కేసులో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈవో, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓఎస్డీ గుండమరాజు కల్యాణ్‌కుమార్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు.
వారిద్దరిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టువారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. గొర్రెల పంపిణీ స్కీమ్‌లో రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులు పక్కదారిపట్టడంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులు, బినామీ అకౌంట్ హోల్డర్లను కలిపి మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు.
మాజీ ఎండీ, తలసాని ఓఎస్‌డీ నిందితులే
ప్రభుత్వ నిధులను దారి మళ్లించడంలో సహకరించిన మాజీ ఎండీ సబావత్ రాంచందర్‌ను ఏ-9గా, తలసాని మాజీ ఓఎస్‌డీ కల్యాణ్‌కుమార్‌ను 10వ నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వీరిద్దరి పాత్రపై దర్యాప్తు చేశారు. స్కీమ్‌లో అవకతవకలకు బాధ్యులుగా గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై గొర్రెల సేకరణ ప్రక్రియను ప్రైవేటు వ్యక్తులు, బ్రోకర్లకు అప్పగించినట్టు తేల్చారు. గొర్రెల కొనుగోలు పేరిట ప్రభుత్వ సొమ్ము ప్రైవేట్వ్యక్తులకు చేరేలా చేశారని ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇవ్వాల్సిన నిధులు కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి దారి మళ్లించినట్టు ఆధారాలు సేకరించారు.
అరెస్టయింది వీళ్లే..
ఈ కేసులో ఫిబ్రవరిలో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పసుల రఘుపతిరెడ్డి, నల్గొండ వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్‌ను అరెస్ట్ చేశారు. మార్చిలో పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ పీ కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కాంట్రాక్టర్లు మొయినొద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్ పరారీలో ఉన్నారు. దర్యాప్తులో లభించిన కీలక ఆధారాల మేరకు సబావత్ రాంచందర్, కల్యాణ్ కుమార్‌ను తాజాగా అరెస్టు చేశారు.
గొర్రెల స్కీమ్‌లో స్కామ్ జరిగింది ఇట్లా
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో గొర్రెల స్కీమ్‌ను అమలు చేశారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాంత లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసేందుకు ఏపీలోని పల్నాడు జిల్లా అంగలూరుకు చెందిన 18 మంది గొర్రెల సరఫరాదారులను సంప్రదించారు. పశువైద్యశాఖ అధికారులు రవి, ఆదిత్య కేశవసాయితో పాటు కాంట్రాక్టర్లు మొయినొద్దీన్, ఇక్రమ్ కలిసి 133 మంది లబ్ధిదారులను తీసుకెళ్లి 133 యూనిట్లను ఒక్కో యూనిట్ రూ.1.58 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన డబ్బులను గొర్రెలు విక్రయించిన రైతులకు ఇవ్వకుండా స్కామ్‌కు తెరలేపారు.
రూ.2.10 కోట్లను అసలు గొర్రెల సరఫరా రైతుల పేరిట కాకుండా బినామీల పేరిట చెక్కులు మంజూరు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై డిసెంబర్‌లో గచ్చిబౌలి పోలీసులకు బాధిత రైతులు ఫిర్యాదు చేశారు.ఈ స్కామ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కేసును ఏసీబీకి బదిలీ చేసింది. దర్యాప్తులో లభిస్తున్న ఆధారాలతో ఏసీబీ అధికారులు అరెస్ట్‌ల పర్వం కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో రూ.700 కోట్లు అధికారులు, కాంట్రాక్టర్లు జేబులో వేసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనిపై పూర్తి విచారణ జరుపుతున్నారు.