జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

హైదరాబాద్: జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్టీజెన్ శివ చందర్ రెడ్డి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద 5 వేల రూపాయాలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. గాజుల రామారాంలో నివాసం ఉండే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన పాత కమర్షియల్ ఎలక్త్రికల్ మీటర్ ఉపయోగించడం లేదని.. తాను కట్టిన డిపాజిట్ 58వేల రూపాయలు తిరిగి ఇవ్వాలని జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. 

అదే కార్యాలయంలో అకౌంట్స్ సెక్షన్ లో పని చేస్తున్న ఆర్టిజన్ శివ చందర్ రెడ్డి ఈ ఫైల్ క్లియర్ చేయాలంటే తనకు 5వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ వారి సూచన మేరకు ఇవాళ ఉదయం జీడిమెట్ల విద్యుత్ కార్యాలయానికి చేరుకుని శివ చందర్ రెడ్డిని కలసి లంచం డబ్బు ఇచ్చాడు. అయితే అదే సమయంలో రంగారెడ్డి జోన్ ఏసీబీ డీఎస్పి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడి వద్ద తీసుకున్న లంచం డబ్బు రూ.5వేలు నగదును సీజ్ చేయడంతోపాటు నిందితుడు శివను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు కార్యాలయంలో సోదాలు జరుపుతూనే... మరోవైపు శివచందర్ రెడ్డి అక్రమ ఆస్తుల గురించి ఆయన ఇంటిలో మరో బృందం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.