
యాదాద్రి, వెలుగు : ఆ హాస్టల్లో ఉండాల్సింది 40 మంది స్టూడెంట్స్.. కానీ ఉన్నది 9 మందేనని ఏసీబీ ఆఫీసర్లు గుర్తించారు. మిగిలిన వాళ్లు సెలవులకు వెళ్లారంటూ హాస్టల్ వార్డెన్ ఏసీబీ ఆఫీసర్లతో చెప్పుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా రామన్నపేటలోని ఎస్సీ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఏసీబీ నల్గొండ డీఎస్పీ జగదీశ్ చందర్ నేతృత్వంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
శుక్రవారం తెల్లవారుజామున ఆరు గంటలకు ఆఫీసర్లు హాస్టల్లో ప్రవేశించారు. ఆ సమయానికి వాచ్మెన్ యాదమ్మ తప్ప ఎవరూ లేరు. హాస్టల్లో ఉండాల్సిన వార్డెన్రాజోలు బాయి లేకపోవడంతో ఫోన్చేశారు. తాను మోత్కూర్ హాస్టల్లో ఉన్నట్టుగా ఆమె సమాధానమిచ్చారు. ముందుగా రికార్డులు పరిశీలించడంతో వాటిని రెగ్యులర్గా మెయింటనెన్స్ చేయడం లేదని గుర్తించారు. హాస్టల్లో వంద మంది స్ట్రెంత్ ఉండగా, 40 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని, అందులోనూ 14 మంది కొత్తగా జాయిన్ అయ్యారని రికార్డుల్లో ఉంది.
అయితే స్టూడెంట్స్మాత్రం కేవలం 9 మంది మాత్రమే ఉండడంతో ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు. ఈ విషయంలో వార్డెన్ రాజోలు బాయిని ఫోన్లో సంప్రదించగా పండగ సెలవులకు వెళ్లారని చెప్పుకొచ్చారు. వంట కోసం తెప్పించిన సరుకులు మాత్రం పది మందికి సరిపోను మాత్రమే ఆఫీసర్లకు కన్పించాయి. పైగా పురుగుపట్టిన చింతపండు, నాణ్యతలేని పప్పును వంటల్లో వాడుతున్నారని, పాత్రలు సరిగా లేవని, బాలికల హాస్టల్లోని బాత్రూమ్ డోర్లకు గడియ కూడా లేదని గుర్తించారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను నమోదు చేసుకున్న ఆఫీసర్లు, వాటిని ఏసీబీ ఐజీకి అందిస్తామని తెలిపారు.