
- ఏఈని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలింపు
సూర్యాపేట, కోదాడ, వెలుగు : సూర్యాపేట ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ ఇస్లావత్ వినోద్ కుమార్ ఇంట్లో రెండో రోజూ ఏసీబీ సోదాలు కొనసాగాయి. చిలుకూరు మండలం శీతలతండా, సూర్యాపేట టౌన్ అంజనాపురి కాలనీలోని వినోద్ కుమార్ ఇండ్లలో మహబూబ్ నగర్ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. శీతల తండాకు చెందిన ఆయన గతంలో మహబూబ్ నగర్ జిల్లా కడ్తాల్ లో ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈగా చేస్తూ .. 10 నెలల కింద సూర్యాపేట ఆర్ డబ్ల్యూఎస్ డివిజన్ ఆఫీస్ కు బదిలీపై వచ్చారు.
కడ్తాల్ లో పని చేస్తున్నప్పుడు పనులకు సంబంధించి బిల్లు మంజూరుకు లంచం డిమాండ్ చేశాడు. మంగళవారం రాత్రి సదరు వ్యక్తి అతడికి లంచం డబ్బులు అందించేందుకు ఒప్పుకుని ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు వచ్చి వినోద్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాగా అతను లంచం సొమ్మును తన అన్న కొడుకు రామ్మూర్తికి ఇవ్వాలని సూచించాడు.
రామ్మూర్తి ఆ డబ్బులు తీసుకుని చిలుకూరుకు వెళ్తుండగా ఏసీబీ అధికారులు వెంబడించి కోదాడ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వినోద్ కుమార్ ను విచారణ కోసం మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం శీతల తండాలోని అతని అన్న కొడుకు రామ్మూర్తి ఇంట్లో, సూర్యాపేటలో సోదాలు చేశారు. అనంతరం ఏఈని హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు తరలించారు.