మూడు రోజులే మంచి ముహుర్తాలు

మూడు రోజులే మంచి ముహుర్తాలు
  •     8, 9, 10 తేదీలే మంచి రోజులంటున్న పురోహితులు
  •     నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్న నేతలు

ఆర్మూర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మంచి రోజు చూసుకొని నామినేషన్లు వేసేందుకు నేతలు సిద్ధమౌతున్నారు. ఇందుకోసం తమకు తెలిసిన పురోహితులను సంప్రదిస్తున్నారు. తమ రాశి ఫలాలు, జాతకాన్ని బట్టి ఏ రోజున, ఏ సమయంలో నామినేషన్లు వేస్తే బాగుంటుందనే విషయమై ఆరా తీస్తున్నారు. తమ జాతకం చిట్టా పురోహితులకు చూయించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 

మంచి ముహుర్తాలు ఇవే..

ఈ నెల 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎనిమిది రోజుల్లో ఆదివారం సెలవు కాగా, ఏడు రోజులు అప్లికేషన్లు స్వీకరిస్తారు. కాగా వారం రోజుల్లో 8, 9, 10 తేదీలు మాత్రమే మంచిరోజులని పురోహితులు చెబుతున్నారు. 8వ తేది బుధవారం దశమి, పూర్వ ఫాల్గుణి, 9వ తేది గురువారం ఏకాదశి ఉత్తర నక్షత్రం, 10వ తేది శుక్రవారం ద్వాదశి చిత్త నక్షత్రం ఉన్నందున ఈ మూడు రోజులు మంచి ముహుర్తాలుగా నిర్ణయించారు.

దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ మూడు రోజుల్లోనే నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈ రోజుల్లోనే నామినేషన్లు వేసేందుకు ర్యాలీకి అనుమతి కోరుతూ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లకు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. 

నామినేషన్​ కేంద్రాల వద్ద బందోబస్తు

జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఆర్మూర్ అసెంబ్లీకి ఆర్మూర్ తహసీల్ ​ఆఫీస్ లో, బోధన్ అసెంబ్లీకి బోధన్ ఆర్డీవో ఆఫీస్ లో, నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీకి మున్సిపల్​కార్పొరేషన్ ​న్యూ బిల్డింగ్​లో, నిజామాబాద్​రూరల్​ అసెంబ్లీకి నిజామాబాద్ ఆర్డీవో ఆఫీస్​లో, బాల్కొండ అసెంబ్లీకి భీంగల్ ఎంపీడీవో ఆఫీస్ లో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 10 వరకు స్వీకరణ, 15న విత్​ డ్రా ఉంది. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అయిదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని ఆంక్షలు విధించారు.

ఆ మూడు రోజుల్లోనే నామినేషన్లు..

ఆర్మూర్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఈ మేరకు నామినేషన్స్​తో జత చేయాల్సిన అఫిడవిట్​లను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 8న బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్​రెడ్డి, 9న కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్​ రెడ్డి, బీఆర్ఎస్​క్యాండిడేట్​ ఆశన్నగారి జీవన్ రెడ్డి నామినేషన్లు వేసేందుకు రెడీ అయ్యారు.