
- రోడ్డు ప్రమాదంలో ఇంటర్ స్టూడెంట్ మృతి
- నిద్ర వస్తున్నా డ్రైవ్ చేసిన తండ్రి
- సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో తీవ్ర గాయాలతో కొడుకు మృతి
- జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారులో ప్రమాదం
మెట్పల్లి, వెలుగు : చిన్నప్పటి నుంచి ఆ విద్యార్థి చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. ఎప్పటికైనా ఐఏఎస్ కావాలని కలలు కనేవాడు. అందుకు తగ్గట్టే మొన్న జరిగిన ఇంటర్‌పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ప్రతిభ చూపాడు. కానీ, తండ్రి నిద్రమత్తులో కారు నడపడం, సీట్‌బెల్ట్ పెట్టుకోవాలన్న అవగాహన సదరు విద్యార్థికి లేకపోవడంతో అతడి కలతో పాటు ప్రాణాన్ని అంతం చేసింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారులో చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..మెట్ పల్లిలోని చైతన్యనగర్ చెందిన మహాజన్ శివరామకృష్ణ, శిరీష దంపతులకు మహాజన్ అక్షయ్ (18), రిశ్వంత్ సాయి కొడుకులు. శివరామకృష్ణ పెయింట్ వ్యాపారం చేస్తుంటాడు. పెద్ద కొడుకు అక్షయ్ ఇటీవల ఇంటర్లో 951 మార్కులు సాధించాడు. అతడిని అభినందిస్తూ వారం కింద ఆర్యవైశ్య సంఘం ప్రతిభ పురస్కారం కూడా అందజేసింది.
ఈ క్రమంలో ఇంజినీరింగ్ చేద్దామని నిర్ణయించుకోగా హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడానికి బుధవారం శివరామకృష్ణ, అక్షయ్ కారులో బయలుదేరి వెళ్లారు. అక్కడ పని పూర్తయ్యాక బుధవారం రాత్రి మెట్ పల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యలో శివరామకృష్ణకు నిద్ర రావడంతో రామాయంపేట హైవే పక్కన ఉన్న పెట్రోల్ పంపులో కొంతసేపు పడుకున్నాడు.
నిద్రమత్తు వీడకపోయినా తొందరగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో తిరిగి బయలుదేరాడు. మెట్ పల్లికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని రాజశ్వర్రావుపేట శివారులో నేషనల్ హైవే 63పై వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఎడమవైపు కూర్చున్న అక్షయ్ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో తల ముందు అద్దానికి గుద్దుకుని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. శివరామకృష్ణ సీట్ బెల్ట్ పెట్టుకోగా ఎయిర్ బెలూన్స్ ఓపెన్అయి గాయాలతో బయటపడ్డాడు. ఇతడిని మెట్ పల్లి సివిల్ హాస్పిటల్ కు, అక్కడి నుంచి నిజామాబాద్‌లోని మరో దవాఖానకు తరలించారు.
అమ్మను వచ్చానురా లేవరా అక్షయ్...
రోడ్డు ప్రమాదంలో తన కొడుకు అక్షయ్ చనిపోయాడని తెలుసుకున్న అతడి తల్లి శిరీష మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించింది. ‘అమ్మను వచ్చానురా లేవరా అక్షయ్... ఒక్కసారి మాట్లాడురా. ఐఏఎస్ కావాలని కలలు కన్నావ్ కదా కొడుకా...నిన్ను గొప్ప స్థానంలో చూద్దామని అనుకున్నాం. కానీ, ఇంతలోనే నీ జీవితం అంతమైపోయిందా... ఆ చావు నాకు వచ్చినా బాగుండు కదా ’ అంటూ వెక్కి వెక్కి ఏడ్వడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.
మంచిర్యాల జిల్లాలో ఇద్దరు..
బెల్లంపల్లి రూరల్ : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ పీఎస్పరిధిలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వెంకటాపూర్ కుర్రేఘాట్కు చెందిన పెంద్రం చిలుకు(55) వరుసకు తమ్ముడైన కొట్నాక గణేశ్(24)తో కలిసి కొండాపూర్ యాప నుంచి వెంకటాపూర్‌కు బైక్‌పై వస్తున్నారు.
వెంకటాపూర్శివారులోని డంపింగ్ యార్డు సమీపంలో వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది. దీంతో చిలుకు అక్కడికక్కడే చనిపోగా, గణేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని మంచిర్యాల దవాఖానకు తీసుకువెళ్తుండగా చనిపోయాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ పున్నంచంద్తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ జుగునాక యశ్వంత్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది.