ఆటోకు అడ్డం వచ్చిన కోతిని తప్పించబోగా ప్రమాదం..ఇద్దరు మహిళా కూలీలు మృతి

 ఆటోకు అడ్డం వచ్చిన కోతిని తప్పించబోగా ప్రమాదం..ఇద్దరు మహిళా కూలీలు మృతి
  • 11 మందికి గాయాలు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా నాగాయపల్లి వద్ద ప్రమాదం
  • వనపర్తి జిల్లా అన్నారం టర్నింగ్​లో కోళ్ల వ్యాన్ 
  • ఢీకొని ఇద్దరి కన్నుమూత

వేములవాడ రూరల్, వెలుగు : వేములవాడ రూరల్ మండలంలోని నాగాయపల్లి వద్ద  మంగళవారం సాయంత్రం వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఓ ఆటో కిందికి కోతి దూసుకెళ్లడంతో ఆటో బోల్తా పడి ఇద్దరు మహిళా కూలీలు కన్నుమూశారు. మరో 11 మంది గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం..వేములవాడ అర్బన్​ మండలంలోని చింతల్​ఠాణా ఆర్అండ్ఆర్ కాలనీకి  చెందిన మహిళలు మంగళవారం వరి నాట్లు వేయడానికి చందుర్తి మండలం మరిగడ్డకు వెళ్లారు. 

పని ముగించుకుని తిరిగి ఆటోలో వస్తుండగా వేములవాడ రూరల్ మండలంలోని నాగాయపల్లి వద్ద కోతి అడ్డం వచ్చింది. డ్రైవర్ ​బ్రేక్​ వేసినా అప్పటికే కోతి ఆటో కిందికి వెళ్లడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చింతల్ ఠాణాకు చెందిన జాతరకొండ మల్లవ్వ (55 ) అక్కడికక్కడే చనిపోగా, కుర్ర బాలవ్వ (60 ) కరీంనగర్ దవాఖానాలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. 

డ్రైవర్ ​రాజు, చొక్కాల కనకవ్వ, లింగంపల్లి పద్మ, అబ్బగోని లస్మవ్వ, బోయిని తార,  చొక్కాల లక్ష్మి, కూర దేవవ్వతో పాటు మరో నలుగురు గాయపడ్డారు. వీరిని వేములవాడలోని ఏరియా దవాఖానకు తరలించారు. మృతి చెందిన మల్లవ్వకు భర్త దేవయ్యతో పాటు  ముగ్గురు బిడ్డలున్నారు. మరో మృతురాలు బాలవ్వకు భర్త రాజమల్లయ్య, ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ రూరల్​ఎస్ఐ మారుతి తెలిపారు. 

కోళ్ల వ్యాన్​ఢీకొని..  

పానుగల్: వనపర్తి జిల్లా పానుగల్ ​మండలం అన్నారం తండా టర్నింగ్ లో కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్​.. బైక్ ను ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. ఆదివారం రాత్రి దావాజీపల్లికి చెందిన ముగ్గురు యువకులు బైక్ పై వెళ్తుండగా, కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వీరి బైక్​ను ఢీకొట్టింది. దీంతో గడ్డం శివ (20) అక్కడికక్కడే చనిపోగా, గడ్డం రాంబాబు(22) దవాఖానకు తీసుకెళ్తుండగా మరణించాడు. గడ్డం శ్రీకాంత్(19) పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్​ ఉస్మానియా దవాఖానకు తరలించారు.