టీఆర్ఎస్ మీటింగ్​కు పోతుంటే యాక్సిడెంట్​

టీఆర్ఎస్ మీటింగ్​కు పోతుంటే యాక్సిడెంట్​
  • 20 మంది మహిళలకు గాయాలు   ముగ్గురి పరిస్థితి విషమం

హుజూరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ ఎన్నికల సభకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై 20 మంది మహిళలు గాయపడ్డారు. హుజూరాబాద్ మండలం రాజపల్లి సమీపంలో టాటా ఏస్ ట్రాలీని వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో హన్మకొండలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. టౌన్ సీఐ  శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శాలపల్లి ఇందిరానగర్ గ్రామానికి చెందిన 20 మంది మహిళలు ఆటో ట్రాలీలో హుజూరాబాద్ పట్టణంలో జరిగే టీఆర్ఎస్ పార్టీ  మీటింగ్ కు బయల్దేరారు. వెహికల్ స్టార్ట్ అయిన పది నిమిషాలకే రాజపల్లి గ్రామ శివారులో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 20 మంది మహిళలకు  గాయాలయ్యాయి. వీరిని వెంటనే హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఫస్ట్ ఎయిడ్ అనంతరం 18 మంది క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎర్ర ప్రవళ్లిక, కనకం సులోచన, నెల్లి స్వరూప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రుల్లో ఒకరైన మారపల్లి సంధ్య గర్భిణి కావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. గూడ్స్​తరలించే వెహికల్​లో మహిళలను తీసుకెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన చాలా మీటింగ్స్ కు ట్రాక్టర్లు, టాటా ఏస్ ట్రాలీల్లో ప్రజలను తరలించినప్పటికీ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడం గమనార్హం.    
మంత్రి గంగుల, అభ్యర్థి గెల్లు పరామర్శ  
విషయం తెలుసుకున్న మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కరీంనగర్ మేయర్ సునీల్ రావు హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం హన్మకొండలోని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లతో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడి మెరుగైన ట్రీట్​మెంట్​అందించాలని సూచించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
సభకు వచ్చేవారిని రైతులుగా చూపే ప్రయత్నం 
టీఆర్ఎస్ సభకు వస్తూ గాయపడిన వారిని మంత్రి గంగుల కమలాకర్ స్థానికంగా వడ్లు ఆరబోస్తున్న రైతులుగా చూపే ప్రయత్నం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ‘శాలపల్లి దగ్గర రైతులు వారి పొలంలో పండిన పంటను రోడ్డు మీద ఆరబోస్తుండగా తాగిన మత్తులో ఒక లారీ డ్రైవర్ నేరుగా వారి మీదకు వెహికల్​తీసుకెళ్లడంతో సుమారు 17 నుంచి 18 మందికి దెబ్బలు తగిలాయి. వెంటనే మా పార్టీ ఎమ్మెల్యేలు స్పందించి వారిని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. 12 నుంచి 13 మందికి చిన్న చిన్న దెబ్బలు తగలడంతో డ్రెస్సింగ్ చేసి పంపించారు. ముగ్గురికి తలకు దెబ్బలు తగిలాయి. కొంత మందికి ఆర్థో ప్రాబ్లమ్స్ వచ్చాయి. వారిని వరంగల్ కు తరలించాం. సీటీ స్కాన్ చేశాక ఇంకా ఏమైనా సమస్య ఉందంటే హైదరాబాద్ కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తాం’ అని గంగుల పేర్కొన్నారు. 

ఏమైందో అర్థం కాలే..
మేం 21 మందిమి ట్రాలీలో శాలపల్లి ఇందిరానగర్ నుంచి టీఆర్ఎస్ మీటింగ్ కని హుజూరాబాద్ పోతున్నం.  రాజపల్లి దాటిన తర్వాత యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ ఎట్ల జరిగిందో గుర్తుకు రావట్లేదు. దెబ్బలు తగిలినయి.  – జూపాక లావణ్య, బాధితురాలు