
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నామని, దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని కరీంనగర్ సర్కిల్ చెంజర్ల సెక్షన్లలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేశ్ కుటుంబానికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును, అలాగే, నరేశ్ భార్యకు విద్యుత్ శాఖలో కారుణ్య నియామక ఉత్తర్వులను సోమవారం ఆయన అందజేశారు. హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
ఓ విద్యుత్ కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కు అందజేయడం ఇదే మొదటిసారి. గతంలో రూ. 5 లక్షల వరకే చెల్లించేవారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ‘‘కోటి రూపా యల ప్రమాద బీమా చెక్కు అందించడం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సాధించిన ఘనత. గతంలో ఏ ప్రభుత్వం కూడా కార్మికుల కోసం ఇంత గొప్పగా ఆలోచించలేదు. ఈ పథకం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సాధ్యమైంది. ప్రభుత్వ మానవీయ దృక్పథానికి, కార్మిక సంక్షేమం పట్ల నిబద్ధతకు ఇది అద్దం పడుతుంది.
మొదట సింగరేణిలో ఈ ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టి, ఆ తర్వాత విద్యుత్ సంస్థల్లో అమలు చేస్తున్నాం” అని వివరించారు. విద్యుత్ కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం విద్యుత్ కార్మికుల్లో కొత్త భరోసాను నింపుతుందన్నారు. పథకాన్ని సమర్థవంతంగా అమలుచేస్తున్న ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని డిప్యూటీ సీఎం అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.