
భూపాలపల్లి రూరల్, వెలుగు : సింగరేణి పరిధిలోని భూపాలపల్లి కేటీకే 5ఏ ఇంక్లైన్‌లో గురువారం ప్రమాదం జరుగగా.. ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. కార్మికులు, మైన్ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం (సెప్టెంబర్ 18) ఫస్ట్ షిఫ్ట్‌లో సుమారు 200 మంది కార్మికులు గనిలో డ్యూటీకి వెళ్లారు.
గనిలోని రెండవ లెవెల్ వద్ద గతంలో వేసిన ఐరన్ గడ్డర్ డ్యామేజ్ కావడంతో దాన్ని మార్చి కొత్త గడ్డర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ కట్టర్‌తో గడ్డర్‌ను కట్ చేసిన అనంతరం మంటలు చెలరేగకుండా నీటిని చల్లి బయటకు వచ్చేశారు. కానీ గ్యాస్ కట్టర్ వేడి కారణంగా బొగ్గుకు మంటలు అంటుకొని పొగ రావడం ప్రారంభమైంది.
అప్పటిక్ ఫస్ట్ షిఫ్ట్ టైం ముగియడంతో కార్మికులంతా బయటికి వచ్చారు. కానీ, ముగ్గురు కార్మికులకు కొంత ఆలస్యం కావడంతో వారు పొగ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని మైన్ ఆఫీసర్లకు తెలపడంతో రెస్క్యూ టీమ్ పంపి ముగ్గురిని బయటకు తీసుకొచ్చి హాస్పిటల్‌కు తరలించారు. రెస్క్యూ టీమ్, ఇంజినీర్లు గనిలో పొగలు వస్తున్న ప్రదేశాన్ని గుర్తించి నిప్పును ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు.