
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రిక్ స్కూటీ స్కిడ్ అయ్యి ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్ బ్రేక్ వేశాడు. రెప్పపాటులో స్కూటీపై నుంచి కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు ద్విచక్ర వాహనదారుడు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. లేదంటే సెకండ్ ఆలస్యమైనా ద్విచక్ర వాహనదారుడు బస్ కిందపడి నుజ్జునుజ్జు అయ్యేవాడు. ఈ ఘటన బుధవారం (ఆగస్ట్ 6) మధ్యాహ్నం బస్సు తిరుమల నుండి తిరుపతికి వస్తుండగా జరిగింది.
ALSO READ : ఆలయ అర్చకుడిని సస్పెండ్ చేసిన టీటీడీ
ఘాట్‌పై మలుపు దగ్గర స్కూటీ వాహనదారుడికి అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు ఆర్టీసీ డ్రైవర్. లేదు లేదు.. బస్సు డ్రైవర్‌దే తప్పని వాగ్వాదానికి దిగాడు ద్విచక్ర వాహనదారుడు. ఈ ప్రమాదంతో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భక్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సు, స్కూటీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకపోవడంతో బస్సులో ఉన్న భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.