కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్​ రన్ .. సెల్ఫీలు దిగుతుండగా ఢీకొట్టిన కారు

కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్​ రన్ .. సెల్ఫీలు దిగుతుండగా ఢీకొట్టిన కారు
  • ఓ యువకుడు మృతి, మరొకరికి గాయాలు
  • తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్న పట్టించుకోని పోలీసులు

మాదాపూర్, వెలుగు: మాదాపూర్ లో కేబుల్​బ్రిడ్జిపై రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అర్ధరాత్రి టైంలో ఫొటోలు, సెల్ఫీ వీడియోలు తీసుకునేందుకు, ఇన్​స్టా రీల్స్ చేసేందుకు యువతీయువకులు బ్రిడ్జిపైకి వస్తున్నారు. ఆ టైంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు యువకులు కేబుల్​బ్రిడ్జిపై సెల్ఫీలు దిగుగుతుండగా అటుగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. 

మాదాపూర్ ఇన్​స్పెక్టర్​ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సిటీలోని పర్వత్​నగర్​లో ఉండే కె.అనిల్​(27) డ్రైవర్. యూసఫ్​గూడ పరిధిలోని జవహర్​నగర్​కు చెందిన కె.అజయ్(25) డైలీ లేబర్. వీరిద్దరూ కలిసి కలిసి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లారు. అక్కడ ఫోన్​లో సెల్ఫీలు తీసుకుంటుండగా, ఐకియా నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు వారి మీదికి దూసుకొచ్చింది. అనిల్, అజయ్​ను ఢీకొట్టి వెళ్లిపోయింది. అనిల్​పై నుంచి కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 

అజయ్​కు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరిని సమీపంలోని ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున అనిల్​మృతి చెందాడు. శనివారం ఉదయం అజయ్​డిశ్చార్జ్​అయ్యాడు. ఈ మేరకు మాదాపూర్​ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై ఉన్న సీసీ కెమెరాలను చెక్​చేసి పోలీసుల కారును ట్రేస్​చేశారు. కారు యజమాని వెంకట్​రెడ్డి తన ఇన్నోవా కారును ఫ్రెండ్​కు ఇచ్చానని చెప్పారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేబుల్​ బ్రిడ్జిపై సెల్ఫీలు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రక్షణ చర్యలు చేపడతామని ఇన్​స్పెక్టర్ మల్లేశ్​తెలిపారు.

రక్షణ చర్యలు శూన్యం

హైదరాబాద్​కు ఐకానిక్​గా మారిన కేబుల్ బ్రిడ్జిపై  ప్రమాదాలు పెరుగుతున్నా సైబరాబాద్​పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి సూసైడ్​స్పాట్​గా మారింది. బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వీటికితోడు రోజూ అర్ధరాత్రిళ్లు సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యువతీ యువకులు కేబుల్ బ్రిడ్జిపైకి చేరుకొని ఫొటోలు దిగుతున్నారు. ఇన్​స్టాగ్రాం రీల్స్​చేస్తున్నారు. వెహికిల్స్ రద్దీ ఉంటున్నా, రోడ్డు మధ్యలోకి వెళ్లి రీల్స్​చేస్తున్నారు. బ్రిడ్జిపై ఇరువైపులా బైకులు, కార్లు నిలిపి ట్రాఫిక్​కు కారణమవుతున్నారు. 

అయినప్పటికీ సైబరాబాద్​ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో నిత్యం పెట్రోలింగ్ చేపట్టి కేబుల్​బ్రిడ్జిపై బైకులు, కార్లు ఆపకుండా చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం అర్ధరాత్రి వరకు ఫొటోలు దిగుతూ, రీల్స్, బర్త్​డే కేక్​కటింగ్స్ చేస్తున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇటుగా ట్రావెల్ చేసే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చెక్​ పోస్ట్​ ఏర్పాటు చేస్తాం, రక్షణ చర్యలు చేపడుతాం, కేబుల్​ బ్రిడ్జిపై వాహనాలు నిలిపితే రూ.1000 ఫైన్​ విధిస్తాం అని పోలీసు అధికారులు చెబుతున్నారే తప్ప అమలుచేయడం లేదని మండిపడుతున్నారు.