ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సీపీ డా.తరుణ్​ జోషి పోలీస్​ ఆఫీసర్లకు సూచించారు. వరంగల్ ఈస్ట్​, వెస్ట్​ జోన్​లకు సంబంధించిన నెలవారీ క్రైమ్​మీటింగ్​ను శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు జోన్​ల పరిధిలోని పెండింగ్​ కేసుల వివరాలను సీపీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైవేలపై ముమ్మర పెట్రోలింగ్​ నిర్వహించాలని, ప్రమాదాలు జరిగినప్పుడు ఆఫీసర్లు కచ్చితంగా స్పాట్​ ను విజిట్​ చేసి కారణాలను విశ్లేషించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చూడాలన్నారు. పెండింగ్ లో ఉన్న మిస్సింగ్ కేసులపై  ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. కేసుల దర్యాప్తు అనంతరం  నేరాలను  నిరూపించే విధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించాలన్నారు. క్రైమ్​ను కంట్రోల్​ చేయడంతో పాటు నేరస్తులను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  డీసీపీలు  వెంకటలక్ష్మి, సీతారాం, ఏసీపీలు నరేశ్​ కుమార్, శివరామయ్య, సంపత్​ రావు, రఘుచందర్, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రావు తదితరులున్నారు.

టీచర్ల ప్రమోషన్లు ఇంకెప్పుడు?

హనుమకొండ సిటీ, వెలుగు: టీచర్ల ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ కోరారు. ఆదివారం హనుమకొండలోని దీన్ దయాళ్ నగర్ లో  ఆ సంఘం జిల్లా కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి స్కూల్​లో సగటున మూడు ఖాళీలు ఉన్నాయని, హెడ్మాస్టర్లు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని టీచర్ల కొరతతో విజయవంతం చేయలేకపోతున్నామన్నారు. ప్రమోషన్లతో పాటు ఖాళీలు సైతం భర్తీ చేయాలన్నారు.

కమలాపూర్ లో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు

భారీగా హాజరైన కార్మికులు

కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలకేంద్రంలో ఆదివారం ఏఐటీయూసీ కార్మిక సంఘం జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. బాలరాజు చీఫ్ గెస్టుగా హాజరై ఈ సభలను ప్రారంభించారు. అంతకుముందు బస్టాండ్ నుంచి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చినా కార్మికుల జీవితాలు మారలేదన్నారు. ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. కార్మికుల సమస్యల కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు తోట బిక్షపతి, కార్యదర్శి కర్రే బిక్షపతి, జిల్లా నాయకుడు జక్కు రాజు గౌడ్, మండల కార్యదర్శి నకిర్త ఓదెలు, నాయకులు శంకర్, లక్ష్మణ్, ప్రభాకర్, బాలరాజు, శివ తదితరులు ఉన్నారు.

నిట్​లో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్

వరంగల్ నిట్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. నిట్ మెయిన్ గేట్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు ఈ రన్ సాగింది. ఆరోగ్యం బాగుండాలంటే వ్యాయామం తప్పనిసరి అని స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొ. రవి కుమార్, కాజీపేట సీఐ మహేందర్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ శారీరక దారుఢ్యం పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో నిట్ స్టూడెంట్లు, సిబ్బంది, కాజీపేట పోలీసులు పొల్గొన్నారు.

- కాజీపేట, వెలుగు

నష్టపరిహారం ఇవ్వలేదంటూ ఆర్ఎంపీ ఇంటి ఆక్రమణ

ఎల్కతుర్తి, వెలుగు: టీకా వికటించి రోగి మృతి చెందగా.. ఒప్పందం ప్రకారం నష్టపరిహారం చెల్లించని ఆర్ఎంపీ ఇంటిని బాధితులు ఆక్రమించారు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బత్తిని సతీశ్(32) ఈ ఏడాది ఆగస్టు 4న ఒళ్లు నొప్పులతో బాధపడుతూ.. ఆర్ఎంపీ తాళ్ల శ్రీనివాస్ వద్దకు వెళ్లాడు. ఆయన టీకా ఇవ్వడంతో సతీశ్ మరింత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్​కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి చనిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆర్ఎంపీ ఇంటి ముందు ధర్నా చేశారు. ఇరు వర్గాల మధ్య డబ్బుల ఒప్పందం కుదిరింది. పరిహారం ఇవ్వకుంటే తన ఇంటిని స్వాధీనం చేసుకోవాలని కూడా రాసిచ్చాడు. మూడు నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆదివారం ఆర్ఎంపీ ఇంటిని ఆక్రమించారు. అక్కడే వంటా వార్పు చేశారు. ఆ టైంలో ఆర్ఎంపీ లేకపోవడంతో అక్కడే బాధితులు ఆందోళన కొనసాగించారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న వైద్యాధికారులు ఆర్ఎంపీ క్లినిక్​ను సీజ్ చేశారు.

ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర టీఆర్ఎస్ దే

– ఫామ్ హౌజ్​ నాయకులు దేశాన్ని ఎలా బాగు చేస్తరు?
– సీఎం కేసీఆర్ పై పొన్నాల లక్ష్మయ్మ ఫైర్

జనగామ అర్బన్, వెలుగు: ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర టీఆర్ఎస్ తోనే ప్రారంభమైందని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్మ విమర్శించారు. ఫాంహౌజ్ లో ఉండి రాజకీయం చేసేవాళ్లు దేశాన్ని ఎలా బాగుచేస్తారని ప్రశ్నించారు. ఆదివారం జనగామ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ యాత్రపై టీఆర్ఎస్, బీజేపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ప్రజలు సరైన సమయంలో కేసీఆర్​కు బుద్ధి చెప్తారన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ శతాబ్దంలోనే  చారిత్రకమైందని పేర్కొన్నారు. నేడు ఎగిరెగిరిపడుతున్న బీజేపీ నాయకులు స్వాతంత్య్రం కోసం పోరాడారా? అని ప్రశ్నించారు. కేంద్రం ‘విభజించు..  పాలించు’ అనే తీరుగా వ్యవహరిస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు మాసాన్​పల్లి లింగాజీ, బడికె ఇందిర, ధర్మపురి శ్రీనివాస్, ఉడుత రవియాదవ్, నర్సయ్య పంతులు 
తదితరులున్నారు.

ప్రభుత్వ సెంటర్లలోనే మద్దతు ధర

జనగామ అర్బన్, వెలుగు: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని, రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని జనగామ ఎంపీపీ మేకల కళింగరాజు సూచించారు. ఆదివారం మండలంలోని శామీర్​పేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ.2060, సాధారణ రకానికి  రూ.2040 మద్దతు ధర ప్రభుత్వం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తాండ్ర స్వరూప, మండల రైతు కోఆర్డీనేటర్ బూరెడ్డి ప్రమోద్ రెడ్డి, వార్డు మెంబర్లు సంపత్, వరలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి తదితరులున్నారు.

అడవి తల్లికి గొడ్డలి కోత

– 200 చెట్లను నరికిన రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులు
– పోడు భూముల పట్టాల కోసమేనంటున్న స్థానికులు

మల్హర్, వెలుగు: ప్రభుత్వం ఓ వైపు పోడు సర్వే నిర్వహిస్తుండగా.. మరోవైపు పోడు పట్టాల కోసం పట్టపగలే పచ్చని చెట్లను నరికేశారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని రుద్రారం, శభాష్​నగర్ బీట్ పరిధిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాటారం మండలంలోని శంకరాంపల్లి, దేవరాంపల్లి గ్రామాలకు చెందిన దాదాపు వంద మంది ఆదివారం ఉదయం రుద్రారం, శభాష్ నగర్ బీట్ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ ను పోడు సాగు చేసేందుకు వెళ్లారు. సుమారు 50 ఎకరాల్లోని 200 చెట్లను నరికివేశారు. స్థానికులు ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చినా, లేటుగా స్పందించి మధ్యాహ్నం వచ్చారు. ఒకరిద్దరు ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని చెట్లను నరకడం ఆపాలని చెప్పినా.. ఎవరూ పట్టించుకోకుండా వివక్షణారహితంగా చెట్లు నరికారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఫారెస్ట్ బలగాలు దిగాయి. దీంతో చెట్లు కొట్టిన వ్యక్తులు పరార్ అయ్యారు. మరికొంతమందిని పట్టుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏడుగురిపై కేసు నమోదు చేశారు. పూర్తి విచారణ అనంతరం మరికొంత మందిపై కేసులు నమోదు చేస్తామని భూపాలపల్లి రేంజర్ నరేశ్​ తెలిపారు.

హెల్త్ కార్డుల మంజూరుకు కృషి చేస్తాం

  • దర్జాగా ఫిల్టర్ ఇసుక తయారీ
  • దుండగులకు సహకరిస్తున్నారని ఆఫీసర్లపై ఆరోపణలు
  • మళ్లీ యథేచ్ఛగా సాగుతున్న బాగోతం

హనుమకొండ, వెలుగు: హనుమకొండ జిల్లాలో ఫిల్టర్​ ఇసుక దందాకు అడ్డుకట్ట పడటం లేదు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్​ తో పాటు వాగులు, చెరువుల వెంట అక్రమంగా మట్టిని తవ్వి.. తరువాత దానిని ఫిల్టర్​ చేసి ఇసుకగా మార్చి నగరానికి చేరవేస్తున్నారు. ధర్మసాగర్​, వేలేరు, ఎల్కతుర్తి, హసన్​పర్తి మండలాల్లో ఈ దందా ఎక్కువగా సాగుతుండగా.. అధికార పార్టీ లీడర్లే ఈ దందా సాగిస్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వ అధికారులు కూడా వారికే సహకరిస్తుండటంతో దందా మళ్లీ యథేచ్ఛగా నడుస్తూనే ఉంది. ప్రతి నెలా ముడుపులు అందుతుండటం వల్లే ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

డిపార్ట్​మెంట్ల సహకారంతోనే..

ఫిల్టర్ ఇసుక దందాకు అన్ని డిపార్ట్​మెంట్ల అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్కతుర్తి శివారులోని వాగులో అధికార పార్టీకి చెందిన ఓ ఇద్దరు లీడర్లు కరకట్టను తవ్వి ఇసుక క్వారీలకు బాట వేసుకున్నారు. ఒకవేళ వాగు ఉధృతంగా ప్రవహిస్తే చుట్టుపక్కలా పొలాలు మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే మైనింగ్​ పర్మిషన్​ లేకుండానే ఇక్కడ మట్టిని తవ్వుతున్న అక్రమార్కులు అనంతసాగర్​ లో డంప్​ చేస్తున్నారు. అనంతరం ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చే ఫ్రీ కరెంట్​ తో మోటార్లు నడిపిస్తూ మట్టిని ఫిల్టర్​ చేసి ఇసుకగా మారుస్తున్నారు. ఈ విషయం ఇరిగేషన్​, మైనింగ్​, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పోలీస్​ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్ల దృష్టిలో కూడా ఉంది. కానీ ఎలాంటి యాక్షన్​ తీసుకోకపోవడం వివిధ అనుమానాలకు తావిస్తోంది. 

మళ్లీ దందా షురూ

ఫిల్టర్​ ఇసుక దందాపై అక్టోబర్​ 20న ‘లీడర్ల సపోర్ట్ తో ఫిల్టర్ ఇసుక దందా’ పేరు వార్త పబ్లిష్​ అయిన విషయం తెలిసిందే. ఆ మరునాడు  వరంగల్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు ఈ బాగోతంపై ఫోకస్​ పెట్టి అనంతసాగర్​ లోని ఫిల్టర్​ ఇసుక డంప్​ పై రైడ్​ చేశారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత రెండు రోజులు గప్​ చుప్​ గా ఉన్న అక్రమార్కులు.. ఇప్పుడు మళ్లీ దందా షురూ చేశారు. ఈ దందా వెనుక ఓ ఇద్దరు లీడర్లు ప్రధానంగా ఉన్నా వారిపై ఎలాంటి యాక్షన్​ లేకపోవడం కూడా ఆఫీసర్ల తీరుకు అద్దం పడుతోంది. ఇకనైనా కృత్రిమం చేస్తున్న ఫిల్టర్​ ఇసుక దందాపై ఆఫీసర్లు పకడ్బందీ చర్యలు చేపడితేనే ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

గ్రానైట్ లారీ ఢీకొని వ్యక్తి మృతి

మరిపెడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆర్లగడ్డ తండాకు చెందిన లూనావత్ రాములు(57) సైకిల్ పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన గ్రానైట్ లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో స్పాట్​లో  ఆయన చనిపోయాడు. రాములు ఆదివారం మరిపెడ పట్టణం నుంచి సైకిల్ మీద ఇంటికి వెళ్తున్న క్రమంలో.. ఖమ్మం–వరంగల్ నేషనల్ హైవేపై ఓ గ్రానైట్ లారీ ఢీకొట్టింది. డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు వెంబడించి దేహశుద్ధి చేశారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెహికల్ ఢీకొని అకౌంటెంట్ మృతి

తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఆదివారం రాత్రి ఓ గుర్తు తెలియని వెహికల్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన తాళ్ల నరేశ్(35) తొర్రూరులోని ఓ ప్రైవేట్ స్కూల్​లో అకౌంటెంట్​గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి బైక్ పై తొర్రూరు నుంచి బ్రాహ్మణకొత్తపల్లికి వెళ్తుండగా.. మండలంలోని మాటేడు గ్రామ శివారులో వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని స్పాట్ లో చనిపోయాడు.

నోములకు వచ్చి కానరాని లోకానికి..

తొర్రూరు(పెద్దవంగర), వెలుగు: దీపావళి నోముల కోసం వచ్చిన ఓ అన్న తన తమ్ముడిని కాపాడబోయి వాగులో పడి చనిపోయాడు. ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్​లో జరిగింది. ఎస్సై ఎస్ కే రియాజ్ పాషా వివరాల ప్రకారం.. తొర్రూరుకు చెందిన చింతల అనిల్(33) దీపావళి నోముల కోసం బొమ్మకల్​లోని తన చిన్నమ్మ దగ్గరకు వచ్చాడు. ఈ నెల 28న తన చిన్నమ్మ కొడుకు మడిపెద్ది ప్రవీణ్​తో కలిసి కాళ్లు, చేతులు కడుక్కునేందుకు పాలేరు వాగు వద్దకు వెళ్లారు. ప్రవీణ్ వాగులో పడిపోగా.. అనిల్ టవల్ విసిరి కాపాడే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో ఆయన కూడా వాగులో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన తన చిన్నాన్న వాగులో దూకి ప్రవీణ్ ను కాపాడారు. అనిల్ వాగు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో మూడ్రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆదివారం అనిల్ డెడ్ బాడీ కనిపించింది.

అనుమానాస్పద స్థితిలో..

వేలేరు, వెలుగు: హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర పరిధిలో ఓ మహిళ, బావిలో పడి అనుమానానాస్పదంగా మృతి చెందింది. వివరాళ్లోకి వెళితే.. ములుగు జిల్లాకు చెందిన ఆవుల లక్ష్మి(26), రమేశ్​ దంపతులు పీచర గ్రామానికి వలస వచ్చారు. స్థానికంగా ఉండే ఓ కోళ్లఫామ్ లో పని చేస్తూ జీవనం సాగించేవారు. ఈక్రమంలో రమేశ్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. శనివారం రాత్రి కూడా ఇలాగే గొడపపడ్డాడు. ఉదయం స్థానికులు లేచి చూసేసరికి లక్ష్మి బావిలో శవమై కనిపించింది. మహిళ సోదరుడు వెంకటయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన బావ రమేశే హత్య చేసి, బావిలో పడేశాడని ఆరోపించాడు.