
కాళేశ్వరం మూడు బ్యారేజీలలో జరిగిన అవినీతిపై సమర్పించిన జస్టిస్ పినాకిని చంద్రఘోష్ నివేదికపై తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. చివరకు సీబీఐకి అప్పగిస్తూ అసెంబ్లీ నిర్ణయం చేసింది. కాళేశ్వరం దోషులను శిక్షిస్తారు.. వారి దోపిడీ ఆస్తులను జప్తు చేస్తారనే తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. 2014 నుంచి 2022 వరకు బీఆర్ఎస్, బీజేపీ రెండు అంటకాగాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ బంధం నాటకీయంగా తెగింది.
కాళేశ్వరంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసినా మోదీ ప్రభుత్వం పూర్తి సహకారం అందించింది తప్ప తప్పుపట్టలేదు. పైగా నితిన్ గడ్కరి లాంటి కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులు కాళేశ్వరం గొప్పతనాన్ని కీర్తించారు. ఆ తర్వాత నుంచి కాళేశ్వరం ఏటీఎం అయిందని కొత్త రాగం వినిపించారు. అందుకే కాళేశ్వరంపై సీబీఐ నిక్కచ్చి దర్యాప్తు త్వరగా జరిపి తెలంగాణకు న్యాయం చేయాలని ఆశిద్దాం.
సమగ్ర మేడిగడ్డ పునరుద్ధరణ రూపకల్పన ఎన్డీఎస్ఏ పరిధిలో లేదు. అయినా దర్యాప్తు, పునరుద్ధరణ రూపకల్పన కోసం దేశంలోని అత్యుత్తమ సంస్థల సేవలను ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని కమిటీ తెలంగాణ నీటిపారుదలశాఖ ఐ అండ్ క్యాడ్ విభాగానికి సిఫార్సు చేసింది. ఇంకా, డిజైన్ సంక్లిష్టతలను దృష్టిలో ఉంచుకుని, రూపొందించిన పునరుద్ధరణ రూపకల్పనను కేంద్ర జలసంఘం సమీక్షించడం ఉత్తమం అని కమిటీ సూచించింది.
అంటే మేడిగడ్డ భవిష్యత్తుపై దేశంలోని అత్యున్నత సంస్థలు మళ్లీ పరిశోధించి ఇచ్చే పునరుద్ధరణ నివేదికను సీడబ్ల్యూసీ సమీక్షించిన తర్వాతనే పునరుద్ధరించడమా? లేదా? అనేది తేలుతుంది.
మేడిగడ్డ ఏడవ బ్లాక్ (11 పియర్స్)ను పూర్తిగా అడుగు నుంచి కూల్చి నిర్మించినా, మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలలో మిగతా బ్లాకులు(పియర్లు) కుంగవనే గ్యారెంటీ లేదని ఎన్డీఎస్ఏ పేర్కొంది. హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులన్నట్టు మూడు బ్యారేజీల్లో నీళ్లు నిలిపి పంపులు నడిపిస్తే, మేడిగడ్డలాంటి విపత్తులు అన్ని బ్యారేజీల్లో సంభవించవచ్చు అని ఎన్డీఎస్ఏ పేర్కొంది. దీని సారాంశం.. మూడు బ్యారేజీల ఖర్చు రూ.25 వేల కోట్లు గంగపాలే.
చట్టవిరుద్ధంగా ప్రణాళిక
మేడిగడ్డ పునాది తిరిగి పునరుద్ధరించలేనంతగా భూమిలో ఐదడుగులు ఎలా కుంగిందో ఘోష్ నివేదికలో దోపిడీని తేల్చిన వాస్తవాలు, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుకు అంతే విపత్తును కలిగిస్తాయి. నీటి లభ్యత లేకపోవడం వల్లే బ్యారేజీ నిర్మాణాన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చామనడంలో ‘కేసీఆర్ ప్రభుత్వానికి నిజాయితీ, సిన్సియారిటీ లేదు’ అని ఘోష్ కమిషన్ అనేకచోట్ల పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యాలకి కేసీఆర్‌ను ప్రత్యక్ష బాధ్యుడిగా నిర్ణయించింది. ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఇంజనీర్లు విస్తృతమైన అధ్యయనం చేసి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించడం ఏమాత్రం సరైనది కాదని, పైగా ఆర్థికంగా అనువైనది కాదన్నారని కమిషన్ పేర్కొంది. ‘ప్రాణహిత– - చేవెళ్ల ఇక లేదు, నేను మేడిగడ్డను నిర్ణయిస్తున్నా’ అని స్వయంగా కేసీఆరే పేర్కొన్నాడు.
కాంట్రాక్ట్ కంపెనీలకు భారీగా మేలు
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2,591 కోట్ల రూపాయల పరిపాలనా ఆమోదం 1.3.2016న జారీ అయింది. ఆ జీఓ నెం. 231, 232, 233లను మంత్రివర్గం ముందు ఉంచలేదని, నీటిపారుదల మంత్రి, ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా జారీ అయిందని నిర్ధారించడమైంది. కాంట్రాక్ట్ కంపెనీలకు భారీగా మేలు జరిగింది. ప్రభుత్వ ఖజానా తీవ్రంగా నష్టపోయింది. అడ్డగోలు నిర్వహణ, మెయింటెనెన్స్ వైఫల్యాలు. ఎత్తిపోయుటకు బ్యారేజీలలో భారీ నీటిని నిల్వ చేయాలని నాటి సీఎం అధికారులను ఆదేశించారని కమిషన్ తెలిపింది. మాజీ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ మౌన నేరస్తుడు. ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ ఈ దుస్థితికి ప్రధాన కారణం. అంతిమంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.
కేబినెట్ ఆమోదం లేకుండానే..
జీవో 231, 232, 233తో బ్యారేజీలను కాంట్రాక్ట్ కంపెనీలకు కేటాయించారు. కానీ, కేబినెట్ ముందుపెట్టి ఆమోదించలేదు. ఇది ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ను పూర్తిగా ఉల్లంఘించడం. దీనిపై హరీష్ రావు తప్పుడు సాక్ష్యాన్ని ఇచ్చారు. అది చెల్లదు. అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రణాళికా రచనను, ఆర్థిక వ్యవస్థను కాపాడడంలో నిబద్ధత, సమగ్రతను ప్రదర్శించలేదు. కాళేశ్వరం ఖర్చు రూ.71,436 కోట్లు అవుతుందని పీఎం నరేంద్ర మోదీకి కేసీఆర్ ఉత్తరం రాసేనాటికి వ్యాప్ కోస్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సీడబ్ల్యూసీకి సమర్పించనే లేదు. డీపీఆర్ లేకుండానే ఏవిధంగా పై అంచనాకు సీఎం కేసీఆర్ వచ్చారు? కాళేశ్వరం కార్పొరేషన్ విఫల వ్యవస్థ అని ఘోష్ కమిషన్ నివేదిక పేర్కొంది. మేడిగడ్డ ప్రతి దశలో ఎల్ అండ్ టీ ఉంది. సీడిఓ అధికారులతో కలిసి పనిచేసింది. నాకు సంబంధం లేదని ఎల్ అండ్ టీ మాట్లాడడం నేరపూరితమైన నిర్లక్ష్యం.
బ్యారేజీల నిర్వహణలో నిర్లక్ష్యం
మూడు బ్యారేజీల నిర్వహణలో సంబంధిత విభాగాల ఘోరమైన నిర్లక్ష్య పర్యవేక్షణతో నిర్మాణానికి భారీ నష్టం వాటిల్లింది. తీవ్రమైన నష్టాలు, లోపాలు గమనించిన తర్వాత పనులు పూర్తయ్యాయని తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి బ్యాంకు గ్యారంటీలను విడుదల చేశారు. రాష్ట్ర డ్యాముల భద్రతాసంస్థ పూర్తిగా వైఫల్యం అయింది. మేడిగడ్డలో 37,228 కాంక్రిట్ నాణ్యత పరీక్షలు చేయాల్సి ఉండగా 7,498 పరీక్షించారు. మూడున్నర వంతుల పరీక్షలు చేయనే లేదు.
మొత్తం గ్రేడింగ్‌ను పాటించినట్టు సమాచారం లేదు. ఫ్లింతు స్లాబ్ ఒకే ఏకశిలగా ఒకే పెద్ద భాగంగా నిర్మించలేదు. పియర్లకు బదులుగా వెంట్ల వద్ద జాయింట్లు. పునాది స్థాయిలో ఇసుక సాంద్రత, బంకమట్టి తొలగింపునకు సంబంధించి అమలుచేసిన ఎటువంటి నివేదికలు లేవు. 2019లో ప్రారంభించిన కొద్దికాలానికే బ్యారేజీలలో లోపాలు బయటపడ్డాయి. భూకంప తనిఖీ, నివేదికలు ఇవ్వలేదు. లోపాలను వెంటనే పరిష్కరించలేదు. మేడిగడ్డలో ‘ఇసుకకు బదులుగా మట్టితో నిండిన కుహరం’, ప్లింత్ స్లాబ్, జాయింట్ నాసిరకం నిర్మాణం పియర్ 20 వద్ద గమనించడమైంది.
కమిషన్ కీలక నిర్ణయాలు
సరైన ప్రణాళిక లేదు. తప్పుడు అంచనాలున్నాయి. అక్రమ ఆమోదాలు జరిగాయి. కాంట్రాక్టులు చట్టవిరుద్ధం. సవరించిన అంచనాలు దురుద్దేశమైనవి. ఏజెన్సీలకు అనుచిత ప్రయోజనాలు ఇచ్చారు. గడువు పొడిగింపు. డిజైన్లు ప్రాథమికంగా లోపభూయిష్టం. నాణ్యత నియంత్రణ సరిగా లేదు. మూడు బ్యారేజీలు లోపభూయిష్ట నిర్మాణం. మాన్యువల్స్ లేవు, ఒప్పందాలు లేవు. ఆర్థిక దుర్వినియోగం జరిగింది. భారీ వడ్డీకి భారీ బడ్జెట్‌యేతర రుణాలు తెచ్చారు. కేఐపీసీఎల్‌కి ఆదాయమే లేదు.
కాళేశ్వరం 3 బ్యారేజీలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇప్పటికే రూ.50 వేల కోట్లు కాళేశ్వరం రుణం చెల్లించారు. మిగిలిన రుణభారం ఒక లక్ష ఐదు వేల కోట్లకు పైగా ఇంకా చెల్లించాలి. పాలకపెద్దలు, బడా కాంట్రాక్టర్లు, అధికారులు ప్రయోజనం పొందారు. కానీ, అంతిమంగా బాధితులు ప్రజలే. తెలంగాణ జీవనాడిగా పేర్కొన్న కాళేశ్వరం.. ప్రజాధనాన్ని భారీగా కొల్లగొట్టిన, పనికిమాలిన ప్రాజెక్టుగా మారిందని ఘోష్ కమిషన్ పేర్కొంది. కనీసం సీబీఐ దర్యాప్తుతోనైనా దోషులు తేలేనా అనేదే ప్రజలు ఎదురుచూస్తున్నారు!
మేడిగడ్డ ఎందుకు కుంగింది?
నీటి తీవ్రమైన వేగం, ఘర్షణ, నష్టాలను పెంచుతుంది. గేట్లు చిన్నగా తెరిచి, భారీ నీటిమట్టాన్ని వదిలేటప్పుడు నీటివేగం చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యవస్థను సమర్థవంతంగా ఆపరేట్ చేయడానికి ఎక్కువ ఒత్తిడి అవసరం. కేసీఆర్ ఆదేశాల మేరకు బ్యారేజీల్లో భారీ ఎత్తున నీళ్లను నిలువ చేశారు. కానీ, నిర్వహణలో ఘోర వైఫల్యంతో మేడిగడ్డ కుంగింది.
మొత్తం వాస్తవాలు, ఆధారాల విశ్లేషణతో మేడిగడ్డ బ్యారేజీ పూర్తి అయినట్టు ధ్రువీకరిస్తూ ఇచ్చిన పత్రాలు తప్పు అని కమిషన్ తిరస్కరించలేని నిర్ధారణకు వచ్చింది. నిర్మాణం పూర్తి కానందున, లోప బాధ్యత వ్యవధి చట్టబద్ధంగా లేదు. కాంట్రాక్టర్ జరిగిన నష్టాన్ని తన ఖర్చుతో మరమ్మతు ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా పనులను పూర్తి చేయడానికి బాధ్యత వహించాలని, లోప బాధ్యత నుంచి కాంట్రాక్టర్ తప్పించుకోలేడని కమిషన్ పేర్కొంది.
- నైనాల గోవర్ధన్,
నీటిపారుదల ప్రాజెక్టుల ఎనలిస్ట్