పంట నష్ట పరిహారం కొందరికే!

పంట నష్ట పరిహారం కొందరికే!

మూడో వంతు పంట నష్టపోతేనే పరిహారం ఇస్తారట!

భద్రాచలం, ఖమ్మం, వెలుగు : 'అకాల వర్షాలకు నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం. ఎకరానికి రూ.10వేలు చొప్పున అందజేస్తాం. రూ.228 కోట్లు గంటలో రిలీజ్​ చేస్తాం, కౌలు రైతులు సాగు చేసిన చోట వారికే పరిహారం ఇస్తాం' అంటూ ఇటీవల ఖమ్మం జిల్లా రావినూతలలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన తర్వాత సీఎం కేసీఆర్ ​ప్రకటించారు. కానీ, ఫీల్డ్​లెవెల్ లో సీఎం  చెప్పిన స్థాయిలో నష్టపోయిన రైతులందరికీ పరిహారం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పంట నష్టం సర్వేకు వస్తున్న అగ్రికల్చర్​ఆఫీసర్లు 33 శాతం పంట పాడైతేనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. కోసి, ఎండబెట్టిన పంటకు పరిహారం అందదని, మిర్చి సాగు కాలం పూర్తి కావడంతో దాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదని.. ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఆఫీసర్లు సమాధానమిస్తున్నారు. చివరకు మక్కజొన్న తప్పించి వరి, మిర్చి, మామిడి సహా చాలా పంటలకు ప్రభుత్వం అందించే పరిహారం వర్తిస్తుందా లేదా అని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత రెండు వారాలు కావస్తున్నా ఎలాంటి సాయం చేతికందకపోవడంతో ఇంకెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. 

కొన్ని పంటలకే పరిహారం 

ఫీల్డ్ సర్వేలో పాల్గొంటున్న అధికారులు చెబుతున్న నిబంధనల ప్రకారం కొన్ని పంటలకే పరిహారం అందే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్​జిల్లాల్లో కేవలం మొక్కజొన్న, వరి మాత్రమే పంట నష్టం సర్వే లెక్కల్లోకి వస్తోంది. మార్చి రెండో వారం వరకు మిర్చి రెండు కోతలు పూర్తవుతాయనే భావనలో ఉన్న ఆఫీసర్లు, పైకి కొన్ని జిల్లాల్లో సర్వే చేస్తున్నా వాటికి పైసలిచ్చేలా కనిపించడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మామిడి, మిర్చి, వరి పంటలకు సంబంధించి ఆఫీసర్లు సర్వే చేశారు. వరికి పొట్ట దశలో కాకుండా, గింజ దశలో ఉండి..గింజలు రాలితేనే పరిహారం వస్తుందని చెబుతున్నారు. కరీంనగర్, నిజామాబాద్​జిల్లాల్లో మొక్కజొన్న, వరి, కర్బూజ, పుచ్చకాయ పంటలను ఆఫీసర్లు సర్వే చేశారు. సిద్దిపేట జిల్లాలో సన్​ఫ్లవర్, మొక్కజొన్నకు మాత్రం పరిహారం అందే అవకాశం ఉంది. వరి, మామిడి రైతులకు రూల్స్​ప్రకారం పైసలు వచ్చే చాన్స్​లేదు. నాగర్​కర్నూలు జిల్లాలో మామిడి, సంగారెడ్డిలో మామిడి, మక్క, టమాట రైతులకు మాత్రమే పరిహారం అందే అవకాశం కనిపిస్తోంది. 

ఉమ్మడి ఖమ్మంలో మిర్చి రైతు విలవిల

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి పంట సాగే ఎక్కువగా ఉంటుంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని నల్లరేగడి, మైదాన ప్రాంతంలో సాగు చేసే మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. దాదాపు రెండు లక్షల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేయగా, ఈ ఏడాది వచ్చిన రికార్డు స్థాయి గోదావరి వరదల కారణంగా సాగు ఆలస్యమైంది. మొదటిసారి వేసిన పంట మొత్తం గోదావరి మింగేసింది. దీంతో రెండోసారి మిరపనార్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేసి సాగు చేశారు. దీనికి తోడు మిరపపై నల్లి పురుగు దాడి చేసింది. వైరస్​సోకి పంటలు ఎండిపోయాయి. అయినా ఉన్న వాటిలోనే దిగుబడులు తెచ్చేందుకు పురుగుమందులు, ఎరువులు వాడి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. తీరా పంట చేతికొచ్చే సమయంలో చెడగొట్టు వానలు అన్నదాత నడ్డి విరిచాయి. మార్చి నెలలో కురిసిన గాలివానలకు చాలా చోట్ల మొక్కలు పడిపోయాయి. కాయలన్నీ నీళ్లలోనే మునిగి కుళ్లిపోయాయి. కోసి కల్లాల్లో ఆరబెట్టిన కాయలు కూడా తడిసి రంగు మారాయి. ఉన్న కొన్ని మొక్కలకు ఇప్పుడు తెగుళ్లు సోకాయి. ఎకరానికి సుమారు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు నష్టం జరిగిందని రైతులు లబోదిబోమంటున్నారు. 

ఇవేం నిబంధనలు  

పంట నష్టం అంచనా కోసం నిర్వహించే సర్వేకు సర్కారు కొన్ని నిబంధనలు పెట్టింది. ఎకరం పొలంలో 33శాతం కంటే ఎక్కువ పంట పాడైతేనే నష్టం కింద పరిగణనలోకి తీసుకుంటారు. కోసిన పంట డ్యామేజ్​ అయినా లెక్కలోకి రాదు. ఇప్పుడు మిర్చి విషయంలో ఇదే జరుగుతోంది. చాలా వరకు రైతులు కాయలు కోసి కల్లాల్లో ఆరబెట్టారు. ఇవి తడిసిపోయినా నష్టం కిందకు రాదని గైడ్​లైన్స్ చెబుతున్నాయి. సాధారణంగా మార్చి నెలాఖరుకే మిరప పంట పూర్తవుతుంది. కానీ, ఈసారి వరదల వల్ల నెల రోజులు ఆలస్యంగా మొదలైంది. ఏప్రిల్​నెలాఖరు వరకు మిరపకాయల కోతలు జరుగుతూనే ఉంటాయి.  ఇవేమీ ఆఫీసర్లు పట్టించుకోలేదు.  

మా ముఖం చూసిన నాథుడే లేడు 

మొన్న నల్లిపురుగు, వైరస్​సోకి మిరప పంట మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. నిన్నటి గాలివానలకు మొక్కలు పడిపోయి, కాయలు తడిసి పోయి భారీగా నష్టం వచ్చింది. కానీ, మా గోడును పట్టించుకున్న ఆఫీసర్ ​లేడు. అప్పుల పాలైనం. సీఎం రూ.10వేలు వస్తయన్నరు. కానీ ఆఫీసర్లు సర్వేకే రావట్లే.   

- బొల్లోజు రవికుమార్​, సీతారాంపురం, దుమ్ముగూడెం

నేటికీ పంట నష్టం అందలేదు

రెండెకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేసిన. ఎకరానికి రూ.25 వేలు కౌలు కాగా, మొక్కజొన్న సాగు చేసి ఎకరానికి రూ.25 వేల చొప్పున పెట్టుబడి పెట్టిన. పంట చేతికి వచ్చే టైంకు అకాల వర్షం, ఈదురు గాలులతో మొత్తం నేలకొరిగింది. పంట చేతికి వచ్చి పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చవచ్చని అనుకుంటున్న తరుణంలో అకాల వర్షం చావు దెబ్బతీసింది. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం గంటలో ఇస్తానని సీఎం చెప్పిండు. వారాలవుతున్నా అందలేదు.  

- వేమాని నరసింహారావు, రైతు, నక్కలగరువు, మధిర మండలం, ఖమ్మం

రూల్స్​ మార్చాలి

మిరప రైతులు నాలుగు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి వానకు మొక్కలు వాలిపోయినయి. ఉన్న మొక్కలకు తెగుళ్లు సోకుతున్నయి. కాయలు తడిసిపోయినయి. కల్లాల్లో కాయలు తడిసి రంగు మారి తాలు కాయలయ్యాయి. ఇవన్నీ నష్టాలే. కానీ అసలు నష్టమే జరగలేదని అగ్రికల్చర్​ఆఫీసర్లు చెప్పడం దారుణం. నిబంధనలు మార్చాలి. రైతులకు న్యాయం చేయాలి. మిర్చి రైతులకు కూడా పరిహారం ఇవ్వాలి. 

- యలమంచి వంశీకృష్ణ, తెలంగాణ రైతు సంఘం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు