ఎర్రగడ్డ దవాఖాన నుంచి పరారైన ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు..వనపర్తి జిల్లా అమరచింతలో ఘటన

ఎర్రగడ్డ దవాఖాన నుంచి పరారైన ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు..వనపర్తి జిల్లా అమరచింతలో ఘటన
  • జూన్​లో పోక్సో కేసులో జైలుకు..

చిన్నచింతకుంట, వెలుగు: హైదరాబాద్ లోని ఎర్రగడ్డ దవాఖాన నుంచి పరారైన ఖైదీ కిశోర్ రెడ్డి(22) బుధవారం వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల శివారులో  ఆత్మహత్య చేసుకున్నాడు. పోక్సో కేసులో చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడిని మంగళవారం హాస్పిటల్​కు తీసుకెళ్లగా.. బాత్​రూంకు వెళ్తానని చెప్పి వెంటిలేటర్​నుంచి పారిపోయాడు. దీంతో పోలీసులు అతడి స్వగ్రామమైన నందిమల్లలో కాపుకాశారు. 

గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేయగా, ఇది చూసిన కిశోర్​రెడ్డి ఊర్లోని చెరువు కట్ట దగ్గరికి వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు తెలియకుండా తమ బిడ్డను పెండ్లి చేసుకున్నాడని ఓ​బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టగా ఈ ఏడాది జూన్ లో అతడిపై పోక్సో కేసు నమోదైంది. అప్పుడు మహబూబ్​నగర్​జిల్లా జైలుకు తరలించారు. 

అయితే, జూలై 6న జైలు నుంచి తప్పించుకున్న కిశోర్​గుళికల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు అతడి ప్రాణాలు కాపాడారు. అప్పుడప్పుడు మతితప్పి ప్రవర్తిస్తుండడంతో చంచల్​గూడ జైలుకు తరలించి ఎర్రగడ్డ మానసిక దవాఖానలో ట్రీట్​మెంట్​చేయిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం కూడా తీసుకురాగా పరారయ్యాడు. చివరికి సొంత ఊరికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.