అలోక్ త్యాగం..అచింతకు స్వర్ణం..

అలోక్ త్యాగం..అచింతకు స్వర్ణం..

కామన్వెల్త్ గేమ్స్ 2022 లో వెయిట్ లిఫ్టర్లు దేశానికి బంగారు పతకాల పంట పండిస్తున్నారు.  ఇప్పటికే మీరాబాయ్‌ చాను 49కేజీల విభాగంలో.. జెరెమీ లాల్రినుంగా 67 కేజీల విభాగంలో పసిడి పూవులు పూయించగా..తాజాగా అచింత షెవులి 73 కేజీల విభాగంలో స్వర్ణ పతకంతో దేశ పతాకాన్ని రెపరెపలాడించాడు. 20ఏళ్ల అచింత షెవులి బంగారు పతకం గెలవడంలో పడిన బాధలు..అనుభవించిన కష్టాలెన్నో. 


అన్నయ్యనే స్పూర్తి..
అచింత షెవులి సొంతూరు పశ్చిమ బెంగాల్‌ హవ్‌డా జిల్లా దేవుల్‌పురి.  తండ్రి వ్యాన్‌ డ్రైవర్‌.  అచింతకు  అలోక్‌ అనే అన్న ఉన్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి బరువులెత్తడం అంటే ఇష్టం.  ఆ తర్వాత అలోక్ వెయిట్‌లిఫ్టింగ్‌లో ట్రైనింగ్ పొందాడు. అన్న అలోక్ వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ కోసం వెళ్తుంటే.. అచింత కూడా అతనితో వెళ్లేవాడు. అన్న బరువులు ఎత్తుతుంటే అచింత కూడా బరువులు ఎత్తేందుకు ప్రయత్నించేవాడు. అలా అన్నను చూసి వెయిట్ లిఫ్టర్ గా మారాలనుకున్నాడు. అచింత ఇంట్రస్ట్ను గమనించిన  కోచ్‌ అస్తానా దాస్‌..అతనికి శిక్షణ ఇచ్చాడు. 

తండ్రి మరణం..తమ్మడి కోసం అన్న త్యాగం..
అచింత కుటుంబ పేద కుటుంబం..రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. తండ్రి పనిచేసి సంపాదిస్తేనే ఇళ్లు గడిచేది. ఈ సమయంలో తండ్రి ఆకస్మికంగా చనిపోయారు. దీంతో అచింత ఫ్యామిలీలో భారీ కుదుపు. అప్పటికీ అచింత, అలోక్ చిన్నవారే. తల్లి గృహిణి. ఆమెకు లోకం తెలియదు. ఈ సమయంలో తండ్రి అంతిమ సంస్కారాలు చేసేందుకు అన్నదమ్ముల దగ్గర డబ్బులు లేని పరిస్థితి.  ఎలాగోలా అచింత కుటుంబం అప్పు చేసి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. ఆ తర్వాత  పూట గడవడం కష్టంగా మారింది.  కుటుంబ పోషణ కోసం అలోక్ చదువు మానేసి కూలి పని చేయడం మొదలు పెట్టాడు. ఈ కష్టకాలంలో తమ్మడి కోసం అన్న అలోక్ త్యాగం చేశాడు.  వెయిట్‌లిఫ్టింగ్‌ లో రాణించాలన్న కలను పక్కన పెట్టేశాడు. అచింతలోనే తనను చూసుకోవాలని నిర్ణయించుకుని..అతనికి శిక్షణ ఇప్పించాడు.  తమ్ముడిని వెయిట్ లిఫ్టర్ గా చూసేందుకు చేతికి దొరికిన పని చేశాడు అలోక్. రోజుకు 12 గంటల కష్టపడ్డాడు.  ఒక్కోరోజూ అన్న అలోక్ తో అచింత, తల్లి కూడా పనికి వెళ్లేది. పొలాల్లో పంటలు పండించడం, బస్తాలు మోయడం వంటి పనులు చేసినట్లు అలోక్ చెప్పాడు. ముగ్గురు పనిచేసి రోజుకు రూ. 1,200 సంపాదించామని అలోక్ తెలిపాడు. 

తొలి టోర్నీలో నాల్గో స్థానమే..
 2013లో అచింత తొలిసారి జూనియర్‌ స్థాయి జాతీయ ఛాంపియన్‌షిప్స్‌ లో  పాల్గొన్నాడు. అయితే టోర్నీలో  అచింత నాల్గో స్థానంలో సరిపెట్టుకున్నాడు. అచింత కుటుంబ పరిస్థితిని గమనించిన కోచ్.. ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ కోసం పూణెకు వెళ్తావా అని అడిగాడు. ఆ కోచ్ కూడా  ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేశాడు. కోచ్ ఇచ్చిన సమాచారంతో..పూణే  ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడ నుంచి అచింత వెనుదిరిగి చూసుకోలేదు. 
 2015లో నేషనల్‌ క్యాంప్‌ నుంచి అచింతకు పిలుపొచ్చింది. అక్కడ శిక్షణ తీసుకుని యూత్‌ కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. ఆ తర్వాత రెండేళ్ల పాటు మళ్లీ ఆర్మీ స్పోర్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందాడు. 

కామన్వెల్త్ కోసం..శ్రమ..
2018 నుంచి నేషనల్ క్యాంప్లో అచింత ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. 2018లోనే జరిగిన ఏషియన్‌ యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో  అచింత సిల్వర్ తో మెరిశాడు. అనంతరం 2019లో జూనియర్‌ కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ దక్కించుకున్నాడు. 2021లో వరల్డ్ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో  సిల్వర్ నెగ్గాడు. 2020 ఒలింపిక్ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 0.02 పాయింట్ల తేడాతో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. అన్న అలోక్ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని అనుకున్నాడో లేక..కుటుంబ బాధలను స్వర్ణంతో దూరం చేయాలని భావించాడో ఏమీ కానీ.. అచింత కామన్వెల్త్‌ గేమ్స్లో పసిడి సాధించాడు. అన్న అలోక్‌తో పాటు..దేశ గర్వించేలా చేశాడు. తను సాధించిన పసిడిని అన్ అలోక్కు అంకితం చేశాడు. 

అచింత స్వర్ణం సాధించడం గర్వంగా ఉంది...
అచింత స్వర్ణం సాధించడం గర్వంగా ఉందని అలోక్ అన్నాడు. గతంలో తమ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండేదని..ఖేలో  ఇండియా గేమ్స్‌లో అచింత స్వర్ణం గెలిచిన తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని చెప్పుకొచ్చాడు. దాని ద్వారా అచింతకు  నెలకు రూ.10,000 స్టైఫండ్ పొందుతున్నాడన్నాడు. అంతేకాకుండా  ఇండియన్ ఆర్మీలో హవల్దార్‌గా  ఉద్యోగం పొందాడని.. అయినప్పటికీ అచింత డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడని అలోక్ చెప్పాడు. తాను కూడా గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశానని..ఫైర్ డిపార్ట్ మెంట్లో  కాంట్రాక్టు ఉద్యోగం పొందానని వెల్లడించాడు. ఇప్పుడు తాను మళ్లీ వెయిట్ లిఫ్టింగ్ ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు.  ఈ సంవత్సరం జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనాలనుకుంటున్నానని తన మనసులో మాట బయటపెట్టాడు.