యాదగిరిగుట్టలో మైనర్లకు గదులిస్తే కఠిన చర్యలు : ఏసీపీ శ్రీనివాస్ నాయుడు

 యాదగిరిగుట్టలో మైనర్లకు గదులిస్తే కఠిన చర్యలు : ఏసీపీ శ్రీనివాస్ నాయుడు

యాదగిరిగుట్ట, వెలుగు: లక్ష్మీనరసింహస్వామి దర్శనం పేరుతో యాదగిరిగుట్టకు వచ్చే మైనర్లకు గదులు ఇచ్చి ఆశ్రయం కల్పిస్తే సంబంధిత లాడ్జి ఓనర్లు, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని యాదగిరిగుట్ట డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ నాయుడు హెచ్చరించారు. గురువారం యాదగిరిగుట్టలోని ఏసీపీ కార్యాలయంలో సీఐ భాస్కర్ తో కలిసి ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.

 ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేకుండా మైనర్లకు రూంలు ఇస్తే సంబంధిత లాడ్జీలను సీజ్ చేసి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. మేజర్లకు కూడా ఆధార్ కార్డ్, ఐడీ ప్రూఫ్ లేనిదే రూంలు ఇవ్వొద్దని, మైనర్లకు గదులు అసలే ఇవ్వొద్దని లాడ్జిల ఎదుట పోస్టర్లు వేశామన్నారు. లాడ్జి ఓనర్లకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఇకపై లాడ్జిల్లో నిరంతర సోదాలు ఉంటాయన్నారు. 

సోమేష్  లాడ్జి నిర్వాహకుడిపై పోక్సో కేసు

 ఈ నెల 21న హైదరాబాద్ అల్వాల్ కు చెందిన ముగ్గురు మైనర్ బాలికలను ముగ్గురు అబ్బాయిలు దర్శనం పేరుతో యాదగిరిగుట్టకు తీసుకువచ్చి.. సోమేష్ లాడ్జ్ లో రూంలు తీసుకుని బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు.  ఈ ఘటనలో ముగ్గురు అబ్బాయిలపై అల్వాల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు  తరలించారని వెల్లడించారు. 

సోమేష్ లాడ్జ్ నిర్వాహకుడిపై అల్వాల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారని తెలిపారు. అనంతరం సోమేష్ లాడ్జ్ ను సీజ్ చేశామని తెలిపారు. సమావేశంలో  యాదగిరిగుట్ట టౌన్ సీఐ భాస్కర్ తదితరులు ఉన్నారు.