కేఎంసీలో మళ్లీ ర్యాగింగ్‌ : ఏడుగురు సీనియర్లపై కఠిన చర్యలు

కేఎంసీలో మళ్లీ ర్యాగింగ్‌ : ఏడుగురు సీనియర్లపై కఠిన చర్యలు

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారించారు. ఏడుగురు సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. డాక్టర్ ప్రీతి ఘటన జరిగి 8 నెలలు గడవక ముందే మరోసారి ర్యాంగింగ్ ఘటన కలకలం రేపుతోంది. జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్, దాడి నేపథ్యంలో వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్ సమావేశమైంది. దాదాపు ఆరు గంటల పాటు యాంటీ ర్యాగింగ్ సభ్యులు సుదీర్ఘంగా విచారించారు.

సెప్టెంబర్ 14వ తేదీన వసతి గృహంలో ర్యాగింగ్ జరిగిందని కమిటీ నిర్ధారించింది. జూనియర్ విద్యార్ధిపై ర్యాగింగ్ కి పాల్పడిన ఏడుగురు సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్, దాడి చేసిన ఏడుగురు విద్యార్థులను మూడు నెలల పాటు కాలేజీ నుంచి, ఒక ఏడాది పాటు హాస్టల్ వసతి నుంచి సస్పెండ్ చేశారు వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్. ఇదే కేసులో మరో 20 మంది విద్యార్థులకు నోటీసులు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు.

వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగడం ఇదే తొలిసారని, పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోందని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ చెప్పారు. ఇప్పటికే ఏడుగురు సీనియర్ విద్యార్థులపై మట్వాడ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది.