
- రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఆప్షన్ ట్రేడర్లు ఇంకా 70 శాతం ఎక్కువ
- పరిశీలించి, రిస్ట్రిక్షన్లు పెంచాలని చూస్తున్న సెబీ!
న్యూఢిల్లీ: మార్జిన్ రిస్ట్రిక్షన్లు పెట్టినా, ఇతర చర్యలు తీసుకున్నా, అనుకున్నంతగా ఆప్షన్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గలేదని సెబీ భావిస్తోంది. ఈ యాక్టివిటీని మళ్లీ పరిశీలించి, అవసరమైతే తదుపరి చర్యలు తీసుకోవాలని చూస్తోంది. కిందటేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఇండెక్స్ ఆప్షన్స్‌లో యాక్టివిటీని పరిశీలించింది. గత సంవత్సరంతో పోలిస్తే కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, రెండేళ్ల క్రితంతో పోలిస్తే యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉందని నిర్ధారించింది. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లు చేసే 90 శాతం ట్రేడ్స్ నష్టాల్లో ముగుస్తున్నాయని డేటా చెబుతోంది. దీంతో కిందటేడాది నవంబర్ నుంచి సెబీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌ఓ) సెగ్మెంట్‌పై కొన్ని ఆంక్షలు విధించింది. తాజాగా నాలుగు నెలల డేటాను విశ్లేషించింది. దీని ప్రకారం, ఈక్విటీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్ చేసే వ్యక్తుల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 12 శాతం తగ్గింది. కానీ, రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇంకా 77 శాతం ఎక్కువగా ఉంది.
ఇండెక్స్ ఆప్షన్స్‌లోనే ఎక్కువ..
ఇండెక్స్ ఆప్షన్స్ విషయంలో, ఎక్స్‌పైరీ డేస్‌లో స్పెక్యులేషన్ ఎక్కువగా జరుగుతోంది. రెండేళ్ల క్రితంతో పోలిస్తే వ్యక్తుల ట్రేడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇండెక్స్ ఆప్షన్స్ వాల్యూమ్ కాంట్రాక్ట్‌ల పరంగా గత నాలుగు నెలల్లో 16 శాతం తగ్గినా, రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇంకా 99 శాతం ఎక్కువగా ఉన్నాయి. "సెబీ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్, సిస్టమిక్ స్టెబిలిటీ దృష్ట్యా ఇండెక్స్ ఆప్షన్స్‌లో వ్యక్తుల ట్రేడింగ్ యాక్టివిటీని మళ్లీ పరిశీలిస్తుంది" అని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
గత సంవత్సరం స్పెక్యులేటివ్ ఓవర్‌ట్రేడింగ్‌ను అరికట్టడానికి, ముఖ్యంగా ఎక్స్‌పైరీ రోజున ఇటువంటి ట్రేడ్స్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకున్నా, యాక్టివిటీ ఇంకా ఎక్కువగానే ఉందని అన్నారు. "సెబీ ఇండెక్స్ ఆప్షన్స్‌లో యాక్టివిటీని మానిటర్ చేస్తుంది. అవసరమైతే ఈ విషయంలో తదుపరి చర్యల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది”అని పేర్కొన్నారు.
ట్రేడర్లు లాస్ అవుతున్నారనే సెబీ మొదట చర్యలు తీసుకుంది. నెలల తరబడి విశ్లేషించి, డ్రాఫ్ట్ ప్రతిపాదనలపై పబ్లిక్ రెస్పాన్స్ తీసుకొని, చివరికి అమలు చేశారు. ప్రస్తుతం డెరివేటివ్ ట్రేడింగ్‌లో గ్లోబల్‌గా ఇండియా టాప్‌లో కొనసాగుతోంది. వృద్ధి వేగంగా ఉందని, దీనికి తగ్గట్టు రిస్క్ మానిటరింగ్ లేకపోతే కష్టమని నిపుణులు చెబుతున్నారు. కాగా, సెబీ తాజాగా ఇండెక్స్ ఆప్షన్స్ కోసం పొజిషన్ లిమిట్స్‌ను నెట్ బేసిస్‌పై 1,500 కోట్ల రూపాయలకు, గ్రాస్ బేసిస్‌పై 10,000 కోట్ల రూపాయలకు పొడిగించింది. ఇంట్రాడే లిమిట్ లేకుండా మార్కెట్ పార్టిసిపెంట్స్ సజావుగా తమ ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.